15 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే సేవలు
► రిజిస్ట్రేషన్ల శాఖకు టీసీఎస్ స్పష్టీకరణ
► 100 మందికిపైగా
► ఇంజనీర్ల ఉపసంహరణ ఆన్లైన్ సేవలపై ప్రభావం
సాక్షి, హైదరాబాద్: తమకు రావాల్సిన రూ. 15 కోట్ల బకాయిలను చెల్లించే వరకు రిజిస్ట్రేషన్ల శాఖలో సాంకేతిక సేవలను కొనసాగించే ప్రసక్తే లేదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ల శాఖకు ఫెసిలిటీ మేనేజర్ (ఎఫ్ఎం)గా కుదిరిన కాంట్రాక్టు ఆగస్టు 18నే ముగియడంతో అప్పటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 100 మందికిపైగా సర్వీస్ ఇంజనీర్లను వెనక్కి తీసుకుంది. ఫలితంగా రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, 12 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలతోపాటు హైదరాబాద్‌లోని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాలయంలోనూ ఆన్లైన్ సేవలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి.
తాజాగా రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ టీసీఎస్ అధికారులను పిలిచి మాట్లాడినా బకాయిలు చెల్లించే వరకు సేవలను పునరుద్ధరించేది లేదని ఆ సంస్థ పేర్కొన్నట్లు తెలిసింది. ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే రిజిస్ట్రేషన్ల శాఖలో రూ. 15 కోట్ల బకాయిలను చెల్లించలేని దుస్థితి నెలకొనడంపై ఆ శాఖ సిబ్బంది కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్ఎం నియామకంలో ఐటీశాఖ జాప్యం!
ఉమ్మడి రాష్ట్రంలో ఐదేళ్ల కాలానికి 2011లో అప్పటి ప్రభుత్వం టీసీఎస్‌ను రిజిస్ట్రేషన్ల శాఖకు ఫెసిలిటీ మేనేజర్ (టెక్నికల్)గా నియమించింది. గడువుకు మూడు నెలల ముందుగానే కొత్త ఎఫ్ఎం నియామక ప్రక్రియను ఉన్నతాధికారులు పూర్తి చేయాల్సి ఉండగా ఆ మేరకు ప్రయత్నాలేమీ జరిగినట్లు కనిపించడం లేదు. కొత్త ఎఫ్ఎం నియామకం కోసం టెండర్లు పిలవాలని ఐటీశాఖను రిజిస్ట్రేషన్ల శాఖ విన్నవించినా ఆ ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదని సమాచారం.
సర్వర్ సమస్యలతో సతమతం
ఎఫ్ఎం సాంకేతిక సేవలు నిలిచిపోవడంతో నెలరోజులుగా క్షేత్రస్థాయిలో నిరంతరం సర్వర్ డౌన్ కావడం, నెట్వర్క్ పనిచేయకపోవడం వంటి సమస్యలు రిజిస్ట్రేషన్ల శాఖను పట్టిపీడిస్తున్నాయి. పది నిమిషాల్లో పూర్తి కావాల్సిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ... సాంకేతిక సమస్యల కారణంగా గంటలకొద్దీ సమయం తీసుకుంటోంది. సాధారణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 30 నుంచి 50 డాక్యుమెంట్లు, నగరాల్లోనైతే రోజుకు 100 నుంచి 150 డాక్యుమెంట్ల దాకా రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయని... సాంకేతిక సమస్యలతో పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని సబ్ రిజిస్ట్రార్లు వాపోతున్నారు.