‘దేశ రాజకీయాల్లోకి మళ్లీ నేనొస్తున్నాను..’
లండన్: తాను మరోసారి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్(63) స్పష్టం చేశారు. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకే తాను తిరిగి దేశీయ రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. లేబర్ పార్టీ బాధ్యతలను 1994 నుంచి 2007 వరకు నిర్వహించిన టోనీ.. 1997నుంచి దాదాపు పదేళ్లపాటు బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు. అయితే, జూన్ 8న జరగనున్న సాధారణ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయడం లేదని చెప్పారు. ప్రజాభీష్టాలకు అనుగుణంగా పనిచేసే ఒక రాజకీయ సంస్థలాంటిదానిని ఏర్పాటుచేసి దాని ద్వారా ప్రజల గొంతును ప్రజల మధ్యే ఉండి వినిపిస్తూ తన బాధ్యతలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు.
అయితే, తన నిర్ణయం భారీ స్థాయిలో విమర్శలు వస్తాయని కూడా తనకు తెలుసని, అయినా, వాటన్నింటికీ తానే సంపూర్ణ బాధ్యత వహిస్తానని చెప్పారు. టోనీ బ్లేయర్ తాను పదవీ కాలం ముగిసేవరకు కూడా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా సమస్యలపైనే పెద్ద మొత్తంలో పనిచేసిన ఆయన తాజాగా బ్రెగ్జిట్ విషయంలో ప్రజలు మరోసారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బ్రెగ్జిట్ అనే అంశమే మరోసారి రాజకీయాల్లోకి వచ్చేలా తనను పురికొల్పిందని అన్నారు. ఒక చారిత్రాత్మకమైన ఈ సందర్భంలో తాను మౌనంగా ఉండలేనని, అలా ఉంటే తాను తన దేశ బాగోగుల గురించి పట్టించుకోని వాడినవుతానంటూ వ్యాఖ్యానించారు.