రూ. 1700 కోట్ల కుంభకోణంలో మాజీ మంత్రి ప్రమేయం
న్యూఢిల్లీ: నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ (ఎన్టీసీ) కుంభకోణం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్టీసీకి సంబంధించిన రూ. 1700 కోట్ల విలువైన భూముల అమ్మకాలలో నాటి కేంద్ర మంత్రి శంకర్ సింగ్ వాఘేలాతోపాటు ఎన్టీసీ మాజీ చైర్మన్ రామచంద్ర పిళ్లై హస్తం ఉందని సీబీఐ నిర్ధారణకు వచ్చింది.
ఆ క్రమంలోనే బుధవారం సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మంగళవారం ఎన్టీసీ మాజీ చైర్మన్ పిళ్లై నివాసం, కార్యాలయాల్లో జరిపిన తనిఖీలలో పలు ఆధారాలు లభ్యమయ్యాయని, అవి కుంభకోణంలో పిళ్లైతోపాటు మాజీ మంత్రి వాఘేలా పాత్రలను నిర్ధారించేవేనని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. యూపీఏ ప్రభుత్వం హయాంలో దేశవ్యాప్తంగా ఎన్టీసీకి చెందిన భూములను విక్రయించాలని నిర్ణయించిన దరిమిలా, తమకు అనుకూలురైన వ్యక్తులకు భూములు కట్టబెట్టేందుకు వాఘేలా, పిళ్లైలు నిబంధనలను మార్చివేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం చార్జిషీటు దాఖలుతో ఆ ఆరోపణలు వాస్తవాలేనని తేలే అవకాశం ఉంది.