'ఉస్మానియా తరలింపుపై అనవసర రాద్ధాంతం'
రహమత్నగర్: ఉస్మానియా ఆస్పత్రిని తరలించడంపై రాద్ధాంతం చేయడం మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం బోర్డు సభ్యుడు గంధం అంజన్న సూచించారు. శిథిలావస్థకు చేరుకున్న ఆస్పత్రి భవనాన్ని అనివార్య పరిస్థితుల్లో తొలగించక తప్పడం లేదని ఆయన స్పష్టం చేశారు.
రహమత్నగర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చారిత్రక కట్టడం అంటూ కొంత మంది నాయకులు రాద్ధాంతం చేయడంలో అర్థం లేదని, పాత భవనాలు ఎప్పుడు కూలిపోతాయో ఎవరికీ తెలియని పరిస్థితిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంచి నిర్ణయం తీసుకొని ఆస్పత్రిని తరలిస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని వాటిని ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరని అంజన్న అన్నారు.