వాట్సాప్ లో గ్యాంగ్ రేప్ వీడియో
పిలిభిత్(ఉత్తరప్రదేశ్): పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం అదృశ్యమైన వివాహిత ఆచూకీ కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పెట్టిన కేసును నమోదు చేయలేదు. అదృశ్యమైన వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వీడియో క్లిప్ వెల్లడికావడంతో హడావుడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
సుగంధి పోలీస్ స్టేషన్ పరిధిలో బార్హా గ్రామానికి చెందిన ఓ మహిళ నవంబర్ 23న తన మూడు నెలల బిడ్డను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. నాలుగు రోజుల క్రితం ఆమె సోదరుడికి వాట్సాప్ ద్వారా ఒక వీడియో క్లిప్ అందింది. ఐదుగురు దుండగులు వివాహితపై అత్యాచారానికి పాల్పడి, వీడియో తీశారు.
దీంతో మరోసారి బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దుండగులపై కేసు నమోదు చేశామని ఏఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితులను గుర్తించేందుకు, బాధితురాలి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే తాము మొదట ఫిర్యాదు చేసినప్పుడే స్పందించివుంటే ఇంత దారుణం జరిగివుండేది కాదని బాధితురాలి కుటుంబ సభ్యులు వాపోయారు.