gas blocks
-
గ్యాస్ బ్లాక్‌ల నుంచి వైదొలగనున్న శాంటోస్
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం బీహెచ్పీ బిలిటన్ బాటలోనే ఆస్ట్రేలియాకి చెందిన మరో సంస్థ శాంటోస్ రెండు చమురు, గ్యాస్ బ్లాకుల నుంచి వైదొలగాలని యోచిస్తోంది. అనుమతుల్లో జాప్యాల కారణంగా పనులు ప్రారంభం కాకపోవడమే ఇందుకు కారణం. రక్షణ శాఖ ఆంక్షలు, బంగ్లాదేశ్‌తో సరిహద్దు వివాదాలు మొదలైన వాటి వల్ల ఇంధన అన్వేషణ కార్యకలాపాలు సాగించలేకపోతున్నామంటూ ప్రభుత్వానికి రాసిన లేఖలో శాంటోస్ పేర్కొంది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ శాంటోస్.. 2007 ఫిబ్రవరిలో ఈ బ్లాకులను దక్కించుకుంది. వీటిపై సంస్థ ఇప్పటికే శాంటోస్ 6 కోట్ల డాలర్లు వెచ్చించింది. రక్షణ శాఖ అనుమతుల జాప్యంతో అక్టోబర్‌లో బీహెచ్పీ సైతం పది ఆయిల్, గ్యాస్ బ్లాకుల్లో తొమ్మిదింటి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. -
వియత్నాంలో ఓవీఎల్‌కు 5 బ్లాకులు
న్యూఢిల్లీ: ఆయిల్ రంగ దిగ్గజం ఓఎన్జీసీ విదేశ్కు వియత్నాం 5 ఆయిల్, గ్యాస్ బ్లాకులను కేటాయించింది. బిడ్డింగ్ లేకుండానే ఈ సముద్రగర్భ బ్లాకుల కేటాయింపు జరిగినట్లు ఓఎన్జీసీ విదేశ్ తెలిపింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం, ఉజ్బెకిస్తాన్‌లోని కొసోర్ బ్లాకులోని ఈ క్షేత్రాలను వియత్నాం ప్రభుత్వ సంస్థ పెట్రోవియత్నాం నామినేషన్ ప్రాతిపదికన కేటాయించినట్లు పేర్కొంది. చైనాకున్న ఆధిపత్యానికి చెక్ పెట్టే ప్రయత్నంలో వియత్నాం వీటి కేటాయింపును చేపట్టింది. ప్రభుత్వ రంగ ఆయిల్ దిగ్గజం ఓఎన్జీసీకి విదేశాలలో అనుబంధ సంస్థగా ఓఎన్జీసీ విదేశ్ వ్యవహరించే సంగతి తెలిసిందే. వియత్నాం, ఇండియా, తదితర దేశాలలో ఇంధన రంగంలో పరస్పరం సహకరించుకునేందుకు వీలుగా పెట్రోవియత్నాంతో తాజాగా అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఓఎన్జీసీ విదేశ్ వెల్లడించింది. ఎంవోయూలో భాగంగానే వియత్నాం 5 బ్లాకులను కేటాయించింది. ఓఎన్జీసీ విదేశ్ వీటిని మదింపుచేశాక ఆసక్తి ఉంటే పెట్రోవియత్నాంకు ప్రతిపాదనలు పంపించవచ్చు. ఈ బ్లాకులకు సంబంధించిన డేటాను పరిశీలించాక ఆసక్తి కలిగిన బ్లాకుల కోసమే ఓఎన్జీసీ విదేశ్ ప్రతిపాదనలు చేయవచ్చు. ఈ విషయాలను కంపెనీ సీనియర్ అధికారి ఒకరు ఒక ప్రకటనలో వివరించారు. ఆపై ఆసక్తి కలిగిన బ్లాకుల కోసం ఉత్పత్తి పంపకం కాంట్రాక్ట్(పీఎస్సీ)పై సంతకాలు చేయవచ్చు.