నేటి నుంచి నగదు బదిలీ..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో నగదు బదిలీ పథకం ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. ఇందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. భారత ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మొదట జిల్లాలో గ్యాస్ వినియోగదారులకు పథకం వర్తించనుంది. దీని ప్రకారం ప్రభుత్వం ఇచ్చే రాయితీ సొమ్ము నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. జిల్లాలో 4,36,429 గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. 3,57,859 రెగ్యులర్ ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారు. కాగా.. ప్రస్తుతం 2,12,279 మందికి ఈ పథకం వర్తించనుంది. నగదు బదిలీ పథకం అమలు కావాలంటే.. వినియోగదారుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేస్తారు. ఇప్పటివరకు జిల్లాలో 60 శాతం మాత్రమే ఆధార్ నంబర్లను వారివారి బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేశారు. వీరికి మాత్రమే ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ అందనుంది. దీంతో మిగతా 40 శాతం మంది వినియోగదారులు గ్యాస్ కనెక్షన్ కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో లబ్ధిదారుల బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అధికారులు మాత్రం పథకం అమలు నాటి నుంచి ఒక నెల సమయం ఉంటుందని, ఆ సమయంలో అనుసంధానం చేసుకోవాలని సూచిస్తున్నారు. అనుసంధానం చేసుకోకుంటే సబ్సిడీ రాదని, మార్కెట్ విలువ ప్రకారం గ్యాస్ రీఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. నేటి నుంచి అర్హత కలిగిన వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంది.
నేడు ప్రారంభం..
ఈ నెల 1వ తేదీ నుంచి నగదు బదిలీ పథకం ప్రారంభమవుతుంది. ప్రారంభోత్సవానికి జిల్లా ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య వస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గం టలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నగ దు బదిలీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నాం.
- వసంత్‌రావు దేశ్‌పాండే, జిల్లా పౌర సరఫరాల అధికారి
గ్యాస్ కంపెనీ కనెక్షన్లు ఖాతాతో అనుసంధానం
హెచ్‌పీసీఎల్ 1,24,040 71,764
బీపీసీఎల్ 86,940 52,416
ఐవోసీఎల్ 1,46,879 88,099
--------------------------------------
3,57,859 2,12,279