‘కేబినెట్’ పనిలేకుండా కానిచ్చేద్దాం !
జెన్కోలో హడావుడిగా కొత్త పోస్టు సృష్టి
తన వర్గం వారికి ఇచ్చేందుకు డెరైక్టర్ యత్నం!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు రాష్ర్ట విభజన హడావుడి... మరోవైపు రాజ కీయ అనిశ్చితి. ఇదే అదనుగా ఎవరూ పట్టించుకోరనే ధీమాతో కేబినెట్‌తో సంబంధం లేకుండానే జెన్కోలో కొత్త పోస్టును సృష్టిస్తున్నారు. అనుకూల వర్గానికి చెందిన ఓ వ్యక్తికి ఈ పోస్టును ఇచ్చేందుకు జెన్కో డెరైక్టర్(హెచ్ఆర్) హడావుడిగా మంజూరు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసలే మనుగడ లేని ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(హెచ్ఆర్) పోస్టును ఇప్పటికే ఉందన్నట్టుగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు ఆమోదముద్ర వేయిం చుకునే పనిలో ఆయన ఉన్నట్టు సమాచారం. ఆమోదం లభించ గానే.. అనేక ఆరోపణలున్న తన వర్గానికి చెందిన వ్యక్తిని ఆ సీట్లో కూర్చేబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
మరోవైపు జెన్కోలో హడావుడిగా పదోన్నతులు, బదిలీలు జరుగుతున్నాయి. మొదట్లో వస్తున్న ఆదేశాలను ఒక్కరోజులోనే మళ్లీ మారుస్తూ... రూ. లక్షల్లో దండుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈడీ(హెచ్ఆర్) పోస్టుకోసం ప్రయత్నిస్తున్న సదరు అధికారిణి కేం ద్రంగానే ఈ ఆరోపణలు వినిపిస్తుండటం గమనార్హం. వాస్తవానికి డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్న ఈ అధికారిణికి జాయింట్ సెక్రటరీగా పదోన్నతి ఇచ్చేందుకు ప్రస్తుతం అక్కడున్న వ్యక్తిని ఇంటికి పంపేందుకు ప్రయత్నించారు. దీనిని ‘జెన్కోలో జబర్దస్తీ’ శీర్షికన సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో ఆ ప్రయత్నాల్ని విరమించిన సదరు డెరైక్టర్... తాజాగా ఈడీ పోస్టు పందేరానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
వాస్తవానికి ప్రభుత్వరంగ సంస్థలో కొత్త పోస్టు మంజూరు సులభం కాదు. రాష్ట్ర సర్వీసు రెగ్యులేషన్స్ప్రకారం కొత్త పోస్టును సృష్టించడంతో పాటు ఉన్న పోస్టు హోదా తగ్గించాలన్నా లేదా పెంచాలన్నా కేబినెట్ అనుమతి తప్పనిసరి. అయితే జెన్కోలో కొత్త పోస్టును.. అదీ కేబినెట్‌తో సం బంధం లేకుండా సృష్టించే ప్రయత్నం జరుగుతుండడం గమనార్హం.