ఆశ చూపాడు..టోకరా పెట్టాడు
బహుమతి పేరుతో మోసం
► రూ.28వేలు నష్టపోయిన బాధితుడు
మైసూరు: బహుమానం వస్తుందని ఆశ పడిన వ్యక్తి చివరకు రూ.28వేలు నష్టపోయాడు. ఈ ఘటన మైసూరులో శనివారం వెలుగు చూసింది. అశోక పురం పోలీసుల కథనం మేరకు.. జయనగర ప్రాంతానికి చెందిన అనంతరాము భట్టకు గుర్తు తెలియని వ్యక్తి ఇటీవల ఫోన్ చేశాడు. మీ సెల్ నంబర్‌కు లాటరీ తగిలిందని, దానిని తీసుకోవాలంటే రూ. 28 వేలు చెల్లించాలని సూచించాడు.
అనంతరాము భట్ట సదరు వ్యక్తి బ్యాంకు ఖాతాకు రూ. 28 వేలు జమ చేశాడు. రోజులు గడిచినా బహుమతి అందకపోవడంతో సదరు వ్యక్తి సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని సమాధానం వచ్చింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు అశోక్ పురం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.