Gingili OIL
-
రెండు కిలోల నూనె తాగి..
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ఆదివాసీ గిరిజనులైన తోడసం వంశస్తుల ఆరాధ్యదైవమైన ఖాందేవ్ జాతరలో సోమవారం ఓ మహిళ రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. ఈ జాతర ఆదివారం రాత్రి ప్రారంభం కాగా, తోడసం వంశానికి చెం దిన ఆడపడుచు నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకోవడం ఖాందేవ్ జాతరలో ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం వారు నెలరోజుల ముందే నువ్వుల నూనె ను ఇంటి వద్దే తయారు చేస్తారు. తోడసం వంశంలోని ప్రతి ఇంటి నుంచి పూజకు తీసుకొచ్చిన నువ్వుల నూనెను సేకరిస్తారు. అలా సేకరించిన నూనెను గంగాపూర్ గ్రామానికి చెందిన తోడసం వంశ ఆడపడుచు కుమ్ర లక్ష్మీబాయి తాగి మొక్కు తీర్చుకుంది. రెండేళ్లుగా నూనె తాగి మొక్కు తీర్చుకుంటున్నానని, ఈ ఏడాది మొక్కు తీరిపోతుందని ఆమె పేర్కొంది. ఇలా చేయడం వల్ల సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుం దని వారి నమ్మకం. ఆలయ పూజారి తోడసం ఖమ్ము పటేల్, తోడసం సోనేరావ్ పాల్గొన్నారు. అయితే, ఈ ఆచారం 80 ఏళ్లుగా వస్తుందని, తోడసం వంశానికి చెందిన ఆడపడుచులు మూడేళ్లకు ఒకరు నూనె తాగాల్సి ఉంటుందని ఆలయ పూజారి తోడసం ఖమ్ము పటేల్, తోడసం సోనేరావు తెలిపారు. -
నలుగు వెలుగులు
చలికాలం స్నానం చేసే ముందు నలుగు పెట్టుకోవడం వల్ల చర్మం పొడిబారే సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. చర్మసమస్యలూ దూరం అవుతాయి. నలుగు పిండి తయారుచేసే విధానం: పసుపు, ఆవపిండి, ఉలవ పిండి, మంచి గంధం, మారేడు పత్రాల పొడులను ఉపయోగించవచ్చు. వీటితో పాటు బియ్యపు పిండి, శనగపిండి గరుకుగా పొడి చేసి కలపాలి. ఈ పొడిలో నువ్వులనూనె కలపాలి. నలుగు పిండి మరీ తడిగా ఉండకూడదు. ఒంటికి పట్టించి, వ్యతిరేక దిశలో మర్ధనా చేయాలి. దీని వల్ల ఒంటికి అంటుకున్న మురికి, అవాంఛిత రోమాలు, మృతకణాలు తొలగిపోతాయి. చివర్లో కొంచెం నువ్వుల నూనె అద్దుకొని మేనికి రాసుకోవాలి. లేదంటే ఆవుపాల మీద మీగడ వాడుకోవచ్చు. వారానికి ఒకసారైనా ఒంటికి నలుగు పెట్టుకుంటే చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.