టీటీఐలకు భద్రత కల్పించాలి
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: రైళ్లలో పనిచేసే టీటీఐలు, టీటీఈలకు భద్రత కల్పించాలని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ బ్రాంచి సెక్రటరీ కుప్పాల గిరిధర్‌కుమార్ డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన టీటీఐ విజయకుమార్‌ను టికెట్లు లేని ప్రయాణికులు నడుస్తున్న రైల్లో నుంచి తోసేసిన ఘటనకు నిరసనగా బుధవారం తిరుపతిలో యూనియన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గిరిధర్‌కుమార్ మాట్లాడుతూ రైల్వే శాఖలోని కమర్షియల్ విభాగంలో వేలాది ఖాళీలను భర్తీ చేయకుండా టీటీఐలకు వసూలు లక్ష్యాలను పెంచడంతోనే ఇలాంటి సంఘటనలకు దారి తీస్తోందన్నారు. గతంలో ఒక్కో టీటీఐ నెలకు రూ.40 వేలు టికెట్లు లేని ప్రయాణికుల నుంచి వసూలు చేయాల్సి ఉండగా ప్రస్తుతం ఆ లక్ష్యాన్ని రూ.1.65 లక్షలకు పెంచడం విడ్డూరమన్నారు. లక్ష్యాలను పెంచడంతో రైళ్లలో టికెట్లు లేకుండా ప్రయాణించే వారిపై కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందన్నారు.
దీంతో టికెట్లు లేని ప్రయాణికులు టీటీఐలను నడుస్తున్న రైళ్లలో నుంచి తోసేస్తూ ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారని వాపోయారు. వసూలు లక్ష్యాల కోసం రాత్రింబవళ్లు మానసిక వేధనలకు కూడా టీటీఐలు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇకనైనా రైల్వే శాఖ టీటీఐల సమస్యలను పరిష్కరించి, రైళ్లలో విధుల నిర్వహణ సమయంలో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ చైర్మన్ ఎన్వీ రమణరావు, సీటీటీఐ కృష్ణానాయక్, నాయకులు టీవీ రావు, ఎస్.విజయకుమార్, వేణుమాధవ్, బుకింగ్ సిబ్బంది వేణు, ఏఎస్ రావు, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.