మీతోనే నవ సమాజం
జస్టిస్ చంద్రకుమార్
అనంతపురం లీగల్: ‘మీలోనే శక్తి ఉంది.. మీతోనే నవసమాజం ఏర్పడుతుంది.. బాగా చదివి మంచి ఆలోచనలతో మంచి సమాజాన్ని నిర్మించటం మీవల్లే సాధ్యం’ అంటూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు జస్టిస్ చంద్రకుమార్. స్థానిక కేఎస్ఆర్ ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
విద్యార్థులే ఆశాకిరణాలుగా..భావిభారత నిర్మాణంలో వారిదే కీలక పాత్రగా పేర్కొంటూ వారి ఆలోచనలను పదునుపెట్టటానికి ఆలోచనే ఆయుధంగా మలుస్తున్నానన్నారు. ఎక్కడినుంచి వచ్చాను..ఎక్కడికి వెళుతున్నాను.. అనే చిన్ని ఆలోచనతో మొదలైన తన సత్యాన్వేషణ ఈ కార్యక్రమాలకు ప్రేరణ అన్నారు. పలు విషయాలను ఆయన సూటిగాను సోదాహరణంగా వివరించారు.
మనసులోని భయంవల్లే అన్ని అనర్థాలన్నారు. దానిని పారదోలితే అంతా ధైర్యమేనన్నారు. పరీక్షల్లో మార్కులు, ర్యాంకుల కోసం చదివే చదువులు జీవితానికి ఉపయోగపడవన్నారు. పాఠ్యాంశాలను ఆకళింపు చేసుకుంటేనే ఉపయోగకరమన్నారు. మౌర్య వంశ స్థాపన ఒక స్త్రీ వల్లే సాధ్యపడిందని, అలాంటి చారిత్రక అంశాలు, కథలు జీవితాలను మరింత తేజోవంతం చేస్తాయన్నారు. మంచి పనులు మనిషికి శక్తినిస్తాయని, ఆ శక్తితో గొప్పవాళ్లు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
స్వార్థ భారతి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ (హైదరాబాదు)మోహన్రావు చిన్ని చిన్ని ప్రశ్నలతోనే తన సందేశాత్మక ఝరిని ఆవిష్కరించారు. ప్రతిప్రశ్నకు విద్యార్థులే ముక్తకంఠంతో చెప్పే సమాధానం ఆయన ప్రసంగసారాంశమైంది. ప్రజాగాయకుడు లెనిన్ జస్టిస్ రచించిన కవితను గానం చేశారు. చల్లని వెలుగులనిచ్చే చందమామదే కులం?..చీకట్లను తరిమివేసే సూర్యునిదేకులం?...అంటూ కులం కుళ్లు కడిగేద్దాం నవయుగాన్ని నిర్మిద్దామంటూ ఆ కవితలో చంద్రకుమార్ విద్యార్థులకు పిలుపునందించారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కుల రిజర్వేషన్లు ఎందుకు?, అనుభవం గొప్పదా? జ్ఞానం గొప్పదా?, కోర్టు శిక్షలు, రాజకీయాల్లో అక్రమ ధనార్జన తదితర అంశాలపై విద్యార్థునులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.
ఈ సందర్భంగా విద్యార్థునులను ఆయన అభినందించారు. వారికి బహుమతులుగా పుస్తకాలను బహూకరించారు. తాను రచించిన రెండు పుస్తకాలను కళాశాల గ్రంథాలయానికి అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖరరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్మిక న్యాయస్థానం న్యాయమూర్తి సుమలత, నగర మేయర్ మదమంచి స్వరూప, ఆచార్య కొలకలూరి ఇనాక్ పాల్గొన్నారు.