వైజాగ్ లారస్ ల్యాబ్స్‌లో వార్బర్గ్ పింకస్ పెట్టుబడి
రూ. 550 కోట్లతో మైనారిటీ వాటా
ముంబై: విశాఖపట్టణం కేంద్రంగా పనిచేస్తున్న ఏపీఐ తయారీ సంస్థ లారస్ ల్యాబ్స్‌లో గ్లోబల్ పీఈ సంస్థ వార్బర్గ్ పింకస్ సుమారు రూ. 550 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తద్వారా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన ఫిడిలిటీగ్రోత్ పార్ట్నర్స్, ఫిడిలిటీ బయోసెన్సైస్ జాబితాలోకి చేరింది. ఈ రెండు కంపెనీలూ 2012లో లారస్ ల్యాబ్స్‌లో ఇన్వెస్ట్ చేశాయి. కాగా, వార్బర్గ్ పెట్టుబడి విషయాన్ని లారస్ పేర్కొన్నప్పటికీ ఎంత వాటాను కొనుగోలు చేసిందీ వెల్లడించలేదు. కంపెనీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్(ఏపీఐలు)ను అభివృద్ధి చేయడంతోపాటు, తయారు చేస్తుంది. యాంటీరిట్రోవైరల్(ఏఆర్వీ), కేన్సర్(అంకాలజీ), గుండె సంబంధిత జబ్బులు(కార్డియోవాస్కులర్), చక్కెర వ్యాధి చికిత్స(యాంటీ డయాబెటిక్) తదితర విభాగాల ఏపీఐలను లారస్ తయారు చేస్తోంది. వీటితోపాటు న్యూట్రాస్యూటికల్స్ తదితరాలను సైతం తయారు చేస్తుంది. వీటిని దేశ, విదేశీ జనరిక్ ఫార్మా దిగ్గజాలకు అందిస్తుంది. ఏపీఐలకు తోడు వేగంగా వృద్ధి చెందుతున్న కాంట్రాక్ట్ తయారీ బిజినెస్‌లోనూ కంపెనీకి ప్రవేశముంది.
2008లో కార్యకలాపాలు షురూ
కంపెనీ 2008లో పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యకలాపాలను మొదలుపెట్టింది. గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14) ముగిసేసరికి రూ. 1,200 కోట్ల ఆదాయాన్ని సాధించింది. వృద్ధి బాటలో ఉన్న ప్రస్తుత దశలో వార్‌బర్గ్‌తో జతకట్టడం సంతోషదాయకమని కంపెనీ సీఈవో డాక్టర్ సత్యనారాయణ చవా పేర్కొన్నారు. చౌక ధరల్లో ఉత్పత్తులు, సర్వీసులను అందించేందుకు వీలుగా కొత్తదనం, తయారీ నైపుణ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. తద్వారా కొత్త విభాగాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. వార్బర్గ్కున్న డొమైన్ నైపుణ్యం, గ్లోబల్ నెట్‌వర్క్‌లను వినియోగించుకోవడం ద్వారా కొత్త మార్కెట్లలో ప్రవేశిస్తామని, కస్టమర్లను పెంచుకుంటామని చెప్పారు. కొత్తదనం, పటిష్ట నిర్వహణ వంటి అంశాల ద్వారా లారస్ అభివృద్ధికి కృషి చేస్తున్న యాజమాన్యంపట్ల ఆసక్తిగా ఉన్నామని వార్బర్గ్ పింకస్ ఇండియా ఎండీ నితిన్ మల్హన్ వ్యాఖ్యానించారు.