మంత్రుల మధ్య 'బికినీ' వార్
పనాజీ: గోవా మంత్రుల మధ్య బికినీల గొడవ జరుగుతోంది. బీచ్‌ల్లో బికినీలు ధరించడంపై ఆ రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి సుదీన్ దావలికర్, టూరిజం మంత్రి దిలీప్ పరులేకర్ మధ్య విబేధాలు తలెత్తాయి. ఇందుకు గోవా అసెంబ్లీ వేదికైంది. బీచ్‌ల్లో బికినీలు ధరించడానికి టూరిజం మంత్రి అనుమతించడంపై దావలికర్ వ్యతిరేకిస్తున్నారు.
వాళ్లు (విదేశీ టూరిస్టులు) బికినీలతో బీచ్‌ల బయటకు వస్తే తాను వ్యతిరేకిస్తానని దావలికర్ చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. టూ పీస్ బికినీలు ధరించడం మన సంస్కృతి కాదని అన్నారు. కాగా అసెంబ్లీలో టూరిజం మంత్రి పరలేకర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. 'టూరిజం మంత్రిగా బికినీలకు నేను వ్యతిరేకం కాదు. బీచ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌లో బికినీలు ధరించవచ్చు. అయితే సూపర్ మార్కెట్లు, ఆలయాల్లో కాదు. బీచ్ టూరిజానికి గోవా ప్రసిద్ధి. ఇక్కడికి యూరప్ పర్యాటకులు ఎక్కువగా వస్తారు' అని చెప్పారు. కాగా బికినీల నిషేధించాలని గోవా మంత్రులు సుదిన్ దావలికర్, దీపక్ దావలికర్ డిమాండ్ చేశారు.