పన్ను చెల్లించమంటే.. పళ్లూడగొట్టే యత్నం!
ఎచ్చెర్ల : కంచే చేను మేస్తోంది. సామాన్యుల నుంచి ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేసే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఐటీ శాఖకు చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టేందుకు దొడ్డిదారులు వెతుకుతోంది. బేవరేజెస్ కార్పొరేషన్‌కు చెందిన పన్ను బకాయిల నేపథ్యంలో ఐటీ శాఖ గోదాములను సీజ్ చేయడంతో.. ఆ గోదాములతో పని లేకుండా ఎక్సైజ్ సిబ్బంది ఆధ్వర్యంలో నేరుగా మద్యం షాపులకు సరుకు సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ రూ. 154 కోట్లు ఆదాయ పన్ను బకాయిపడింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆదాయ పన్ను శాఖ నోటీ సులు చేయడంతోపాటు ఈ నెల రెండో తేదీన బేవరేజెస్ కార్పొరేషన్ గోదాములను సీజ్ చేసిన విషయం తెలిసిందే. రెండూ ప్రభుత్వ సంస్థలే అయినందున ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారమవుతుందని అందరూ భావించారు. అయితే కేంద్ర ఐటీ శాఖ పన్ను చెల్లించాల్సిందేనని పట్టుపడుతుండగా.. అంత మొత్తం చెల్లించలేక బేవరేజెస్ కార్పొరేషన్ చేతులెత్తేసింది. ఫలితంగా కార్పొరేషన్ నుంచి మద్యం షాపులకు గత ఆరు రోజులుగా సరుకు సరఫరా నిలిచిపోయింది.
కార్పొరేషన్‌కు మంగళం?
మద్యం కంపెనీల నుంచి వచ్చిన నిల్వలను స్వీకరించి జిల్లాలోని 157 మద్యం షాపులకు, 16 బార్లకు బేవరేజెస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుండగా, మిగతా వ్యవహారాలన్నింటినీ ఎక్సైజ్ శాఖ పర్యవేక్షిస్తోంది. పన్ను చెల్లింపు వివాదం నేపథ్యంలో ఈ పద్ధతికి స్వస్తి చెప్పి అప్పులు తీర్చే బాధ్యత ఏపీ బేవరేజెస్‌కు అప్పగించి, దాన్ని అంచెలంచెలుగా ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఐదు నెలల నుంచి ఏపీ బేవరే జెస్ ఉద్యోగులకు జీతాలు సైతం చెల్లించకపోవడం ఇందులో భాగమేనని ఉద్యోగవర్గాలు ఆరోపిస్తున్నాయి. కార్పొరేషన్‌ను ఎత్తేవేసి ఎక్సైజ్ శాఖకు మొత్తం బాధ్యతలు అప్పగించటం, కేంద్ర ప్రభుత్వ టాక్స్‌ను సైతం ఎగ్గొట్టడం ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎచ్చెర్లలోని ఈ కార్పొరేషన్ గోదాం వద్ద మద్యం నిల్వలతో వచ్చిన 45 వరకు లారీలు అన్ లోడింగ్ కోసం కొన్ని రోజులుగా నిరీక్షిస్తున్నాయి. వీటిని వేరే చోటుకు తరలించి వైన్‌షాపులు, బార్లకు సరుకు తరలించే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం మాత్రం ముక్కు పిండి ట్యాక్స్ వసూలు చేసే పనిలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం పన్ను చెల్లింపు విషయాన్ని పట్టించుకోకుండా అడ్డదారిలో మద్యం ప్రయత్నాల్లో నిమగ్నమైంది. మరోవైపు కొద్దిరోజులుగా మద్యం సరఫరా నిలిచిపోవడాన్ని మద్యం షాపుల వారు సొమ్ము చేసుకుంటున్నారు. సరుకు లేదని చెప్పి ధరలు పెంచేశారు. క్వార్టర్ బాటిల్ ధరను 15 నుంచి 20 వరకు పెంచి అమ్ముతున్నారు. ఇదేమిటని ఎవరైనా అడిగితే ఎక్సైజ్ అధికారులే అమ్మమంటున్నారని నిర్భీతిగా సమాధానం చెబుతున్నారు. ఒకపక్క ఏడు శాతం పెరిగిన రేటు.. మరోవైపు సరఫరా లేదన్న సాకుతో పెంచిన ధర.. వెరసి మందుబాబుల జేబుకు చిల్లు పడుతోంది. దీనిపై ఎచ్చెర్ల బేవరేజెస్ డిపో మేనేజర్ కె.విక్టోరియారాణి మాట్లాడుతే గోదాం తెరిచే విషయమై తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. మరోపక్క సరుకుతో వచ్చిన లారీల సిబ్బంది బేవరేజెస్ కార్పొరేషన్ గోదాం వద్ద కనీస సౌకర్యాలు గానీ, నిలువ నీడ గానీ లేక నానా అవస్థలు పడుతున్నారు.