రోడ్డు ఆక్రమణ
రహదారికి అడ్డంగా గోడ, షెడ్డు నిర్మాణం
టీడీపీ కార్యకర్త దాష్టీకం
నోరుమెదపని నాయకులు, అధికారులు
గాంధీనగర్ (కాకినాడ) :
డెయిరీ ఫారం వద్ద వున్న రెవెన్యూ కాలనీలోని 5వ వీధి రోడ్డు అక్రమణకు గురైంది. ఓ టీడీపీ కార్యకర్త రోడ్డును ఆక్రమించి అడ్డంగా గోడ, షెడ్డు నిర్మించాడని ఈ కాలనీవాసులు వాపోతున్నారు. రెవెన్యూకాలనీలోని 1వ వీధి నుంచి డెయిరీఫారం మెయిన్‌రోడ్డుకు అనుసంధానం చేసి వుంటుంది. ఇలా ఒకటవ వీధి నుంచి 4వ వీధిలోని ప్రతి రోడ్డుకు డెయిరీ ఫారం మెయిన్‌రోడ్డు అనుసంధానం చేసి వుంది. 5వ వీధిలోని రోడ్డు మాత్రం మెయిన్‌రోడ్డుకు అనుసంధానం చేయకుండా మధ్యలో ఓ టీడీపీ కార్యకర్త అడ్డంగా ఒక షెడ్డును, గోడను నిర్మించాడు. రెవెన్యూకాలనీలో 1వ వీధిలోని, 3 వ, 4వ వీధిలోని డ్రైనేజీలు సరిగ్గా నిర్మించకపోవడం వల్ల ఈ మూడు కాలనీ రోడ్లపై మురుగునీరు నిలిచిపోతూవుంటుంది. అయితే ఈ ప్రాంత ప్రజలు ఈ మురుగునీటిలో నుంచి వెళ్లడం ఇబ్బందిగా వుండడంతో 2వ, 5వ వీధిలోని రోడ్లపై రెండు సంవత్సరాల క్రితం వరకు ప్రయాణాలు సాగించేవారు. ముఖ్యంగా 5వ వీధిలోని రోడ్డుపై మురుగునీరు నిలబడకుండా శుభ్రంగా వుండడంతో ఈ కాలనీవాసులు ఈ రోడ్డుపై తమ ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే ఇదే కాలనీలో నివాసం వుంటున్న ఒక పాల వ్యాపారి రెండు సంవత్సరాల క్రితం 5వ వీధిలోని రోడ్డుపై గేదెలను అడ్డంగా కట్టాడు. పశువుల మేత రోడ్లపై అడ్డంగా వేసేస్తుండడంతో కాలనీవాసులు అందరూ కలిసి ఈ వ్యాపారిని నిలదీయగా నేను టీడీపీ కార్యకర్తననీ, తన జోలికి వస్తే ఖబడ్దార్ అని బెదిరించడంతో అతని జోలికి వెళ్లడానికి భయపడ్డారు. కొన్నిరోజుల తరువాత పశువుల పెంటను రోడ్లపై వేయడం, పశువులు వుండే ప్రదేశాన్ని శుభ్రం చేయకుడా వుంచడంతో ఇక ఈ రోడ్డుపై నుంచి ఈ కాలనీవాసులు సంచరించడం మానేశారు. ఇదే అదనుగా భావించిన ఆ వ్యక్తి ఏడాది క్రితం 5వ వీధి రోడ్డుకు, డెయిరీఫారం మెయిన్ రోడ్డుకు మధ్యలో అడ్డంగా ఒక గోడను, తన పశువుల కోసం ఒక షెడ్‌ను కట్టాడు. దీంతో ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు తిరిగే రోడ్డును ఇలా ఆక్రమించడంతో ఈ కాలనీవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆ వ్యక్తిని ఈ విషయమై అడగడానికి వెళితే దుర్భాషలాడాడనీ, తమను కొట్టబోయాడని ఈ కాలనీవాసులు వాపోతున్నారు. నాయకులు, అధికారులు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సర్వే నిర్వహిస్తాం
రోడ్డు మధ్యలో ఒక వ్యాపారి షెడ్డు, గోడను నిర్మించాడని నా దృష్టికి వచ్చింది. ఆ ప్రాంతంలో సర్వే నిర్వహిస్తాం. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయితే అక్రమ నిర్మాణ దారునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
–ఖాలేషా, అసిస్టెంట్ సిటీ ప్లానర్, కాకినాడ నగరపాలక సంస్థ