Grabbing place
-
‘మూసీ’ స్థలాల్లో కబ్జాల జోరు!
సాక్షి, సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున ఉన్న మూసీ నది తీరప్రాంతాల్లోని ఖాళీ స్థలాలకు పర్యవేక్షణ కరువైంది. పరివాహక ప్రాంతంలో గుర్తించిన ఆక్రమిత స్థలాలు సైతం దర్జాగా మళ్లీ మళ్లీ కబ్జాలకు గురవుతున్నా.. పట్టింపు లేకుండా పోయింది. ప్రభుత్వ సైన్ బోర్డుల సాక్షిగా అక్రమార్కులు తమ అవసరాలకు అనుగుణంగా వాటిని వినియోగించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. సరిగ్గా గతేడాన్నర క్రితం మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రభుత్వ ఖాళీ స్ధలాల ఆక్రమితపై రెవెన్యూ యంత్రాంగం కొరఢా ఝలిపించింది. చార్మినార్ మండల పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతంలో ఆరు స్థలాల్లో ఆక్రమణలు తొలగించడంతో పాటు చాదర్‌ఘాట్ నుంచి ఇమ్లిబన్‌కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన వెలిసిన ప్రైవేటు ల్యాండ్ అనే బోర్డును తొలగించి ప్రభుత్వ సైన్‌బోర్డును ఏర్పాటు చేశా రు. ఖాళీ స్థలంలో అక్రమంగా నిలుపుతున్న వాహనాలను ఖాళీ చేయించి అక్కడి స్థలంలో సైతం మరో సైన్ బోర్డు ఏర్పాటు చేశారు. అది కాస్త మూన్నాళ్ల ముచ్చటగా తయారైంది. యథాతథంగా ఖాళీ స్థలం ప్రయివేటు బస్సులు, వాహనాలకు అడ్డాగా మారింది. కొన్నిచోట్ల మళ్లీ గుడిసెలు వెలిశాయి. ఆక్రమిత స్థలాలు 8529 పైనే. నగరంలోని మూసీ ప్రరివాహక ప్రాంతంలో ఆక్రమిత స్థలాలు 8529 పైనే ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. వాస్తవంగా గతేడాదిన్నర క్రితం హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం, మూసీ రివర్ అథారిటీ సంయుక్తంగా మూసీ నదీ తీర ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలపై దృష్టి సారించి ఆక్రమిత స్థలాలను గుర్తించింది. ఇందుకు అప్పట్లో తొమ్మిది బృందాలు రంగంలో దిగి మూసీ నదీ పారుతున్న ఎనిమిది మండలాల పరిధిలో వాస్తవ పరిస్ధితిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాయి. మండలాల వారిగా మూసి నది మొత్తం, పొడవు,ఆక్రమణల ఫొటోలు, వీడియోగ్రాఫ్‌లతో పాటు కేటగిరిల వారిగా పూర్తి స్థాయి వివరాలు సేకరించి వాటి రక్షణ చర్యలు చేపట్టినా..అవి కాగితాలకే పరిమితమయ్యాయి. మండలాల వారిగా... నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మండల వారిగా ఆక్రమిత స్థలాలను పరిశీలిస్తే... ఆసిఫ్‌నగర్ మండలంలో 667, అంబర్‌పేట పరిధిలో 989, బహద్దూర్‌పురా పరిధిలో 4,225, చార్మినార్ పరిధిలో 73, గోల్కొండ పరిధిలో 517, హిమాయత్‌నగర్ పరిధిలో 499, నాంపల్లిలో 658, సైదాబాద్ పరిధిలో 902 ఆక్రమిత స్థలాలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికై రెవెన్యూ యంత్రాంగం అక్రమిత స్థలాలపై దృష్టి సారించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. -
‘కబ్జా’కు కట్టడి!
కబ్జా స్థలంలోని కట్టడాలపై ‘స్ట్రక్చర్ ట్యాక్స్’ అస్త్రం * ఆస్తి పన్నుకు ప్రత్యామ్నాయంగా వసూలు * స్థలంపై కాకుండా కట్టడంపై మాత్రమే పన్ను * కబ్జా స్థలాలపై హక్కు కోరే అవకాశానికి ఇకపై చెల్లు * కేటీఆర్ ఆదేశాలతో పురపాలక శాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు, యూఎల్సీ, వక్ఫ్, దేవాదాయ భూముల కబ్జాలకు అడ్డుకట్ట వేసేందుకు పురపాలక శాఖ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది. ఎక్కడికక్కడ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి విచ్చలవిడిగా అక్రమ భవనాలను నిర్మిస్తుండటం... ఆ తర్వాత కొంతకాలం స్థానిక పురపాలికకు ఆస్తి పన్నులు కట్టినందున కబ్జా స్థలాలపై యాజమాన్య హక్కులు తమకే దక్కుతాయని కబ్జాదారులు కోర్టులను ఆశ్రయిస్తుండటం ప్రభుత్వానికి సమస్యగా మారింది. అనుమతి లేకుండా నిర్మించిన భవనాలు, కబ్జా స్థలాలపై నిర్మించిన కట్టడాల కూల్చివేతకు స్థానిక పురపాలికలు ముందస్తు నోటీసులు జారీ చేసిన వెంటనే కబ్జాదారులు కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకుంటున్నారు. ఇకపై కబ్జాదారులకు ఈ అవకాశం ఉండదు. కబ్జా చేసిన స్థలాల్లో నిర్మించిన నిర్మాణాలపై ఇకపై ఆస్తి పన్నుకు పత్యామ్నాయంగా ‘స్ట్రక్చర్ ట్యాక్స్’ను విధించనున్నారు. కబ్జా స్థలాలపై కాకుండా వాటిపై నిర్మించిన కట్టడాలపై మాత్రమే ఈ పన్నును విధించనున్నారు. దీంతో కబ్జా స్థలాలపై అక్రమార్కులు యాజమాన్య హక్కును కోరే అవకాశం ఇకపై ఉండదు. కబ్జా స్థలాల్లోని భవనాల క్రమబద్ధీకరణ, కూల్చివేత జరిగే వరకు స్థానిక పురపాలిక నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నందుకే ఈ స్ట్రక్చర్ ట్యాక్స్‌ను విధిస్తున్నామని డిమాండ్ నోటీసుల్లో ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఈ మేరకు స్ట్రక్చర్ ట్యాక్స్‌ను విధించేందుకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కసరత్తు ప్రారంభించింది. కేటీఆర్ ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్మించిన అక్రమ భవనాలు, కబ్జా స్థలాల్లోని భవనాలపై చర్యల విషయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. పురపాలక శాఖ డెరైక్టరేట్లో మంగళవారం ఆయన నిర్వహించిన సమీక్షలో సైతం ఈ అంశంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. మంత్రి ఆదేశాలతో పురపాలక శాఖ కొత్త నిబంధనల రూపకల్పనపై దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్ట్రక్చర్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక నిబంధనలను అమల్లోకి తేనుంది. అదేవిధంగా అక్రమ కట్టడాలపై జరిమానాలుగా 25 శాతం నుంచి 100శాతం ఆస్తి పన్నులను అధికంగా చెల్లించినా సదరు భవనాల క్రమబద్ధీకరణ జరగదని స్పష్టం చేస్తూ కొత్త ఆస్తి పన్ను నిబంధనలను తీసుకురానున్నారు. అక్రమ కట్టడాలపై సత్వర చర్యల కోసం టౌన్‌ప్లానింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఇప్పటికే ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆమోదించిన తర్వాత ట్రిబ్యునల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అలాగే అనుమతి లేని కట్టడాలను ఇకపై పురపాలికలు ప్రొహిబిటరీ రిజిస్టర్లో నమోదు చేయనున్నాయి. అనుమతి తీసుకున్న భవనాలకే ప్రస్తుతం రిజిస్టర్లో నమోదు చేసి పీటీఐసీ నంబర్‌ను కేటాయిస్తున్నారు. ఇకపై అనధికార భవనాల కోసం ప్రొహిబిటరీ రిజిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేటీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.