జీఎస్ఎం యూజర్లు @ 73.94 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య అక్టోబర్‌లో 73.94 కోట్లకు చేరింది. సెప్టెంబర్‌తో పోల్చితే ఈ సంఖ్య 73.31 కోట్లు. ఒక్క అక్టోబర్‌లో జీఎస్ఎం వినియోగదారులు 63 లక్షలు పెరిగారు. సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. సంస్థల వారీగా చూస్తే...
భారతీ ఎయిర్టెల్: 27.67 లక్షల మంది కొత్త చందాదారులతో ఈ సంస్థ వినియోగదారుల సంఖ్య 23.79 కోట్లకు చేరింది. మార్కెట్ వాటా 32.18 శాతం.
ఒడాఫోన్: 13.06 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరారు. మొత్తం సంఖ్య 18.94 కోట్లు. మార్కెట్ షేర్ 26.62 శాతం.
ఐడియా సెల్యులర్: 7.24 లక్షల మంది కొత్త వినియోగదారులతో మొత్తం సంఖ్య 16.72 కోట్లకు చేరింది. మార్కెట్ వాటా 22.62 శాతం.
ఎయిర్‌సెల్: 6.12 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరారు. మొత్తం సంఖ్య 8.46 కోట్లకు చేరింది.
టెలినార్: 9.32 లక్షల మందికి కలుపుకుని మొత్తం సంఖ్య 4.87 కోట్లకు ఎగసింది.
ఎంటీఎన్ఎల్: 6,342 మంది కొత్త వినియోగదారులతో సంఖ్య 35.18 లక్షలకు ఎగసింది.
వీడియోకాన్ టెలికం: 51,004 మంది వినియోగదారులను కోల్పోయింది. చందాదారుల సంఖ్య 78.49 లక్షలకు పడిపోయింది.
బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్ గణాంకాలను సీఓఏఐ తెలియజేయలేదు.