భద్రతా దళాల కాల్పుల్లో నటికి తీవ్ర గాయాలు
గత వారం హైఫాలో జరిగిన నిరసన సందర్భంగా బాగ్దాద్ సెంట్రల్ స్టార్, పాలస్తీనా నటి మైసా అబ్ద్ ఎల్హాది ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఆమె గురువారం (మే 13) సోషల్ మీడియాలో "ప్రస్తుతం తాను కోలుకుంటున్నాని.. బాగానే ఉన్నాను’’ అని తెలిపారు.
కోర్టు ఉత్తర్వుల తరువాత అనేక పాలస్తీనా కుటుంబాలు తమ ఇళ్ల నుంచి బహిష్కరణను ఎదుర్కొన్నాయి. దీని ఫలితంగా నగరంలో ఉద్రిక్తతలు పెరిగి నిరసనలకు దారితీసింది. ఈ క్రమంలో కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా గత వారం హైఫాలో ఆందోళన చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో మైసా కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనికులు నిరసనకారులపై గ్రెనేడ్లను కాల్చడం ప్రారంభించిరని.. ఈ ఘటనలో తాను కూడా గాయపడ్డానని వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా మైసా అసలు ఆ రోజు ఏం జరిగిందనేది తెలిపారు.
‘‘ఆదివారం హైఫాలో జరిగిన శాంతియుత నిరసన కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. నినాదాలు, పాటలు ద్వారా మా కోపాన్ని తెలియజేస్తున్నాం. నేను కూడా నినాదాల చేస్తూ.. అక్కడ జరిగే వాటిని రికార్డ్ చేస్తున్నాను. నిరసన ప్రారంభమైన కొద్దిసేపటికే, సైనికులు అక్కడ స్టన్ గ్రెనేడ్లు, గ్యాస్ గ్రెనేడ్లను కాల్చడం ప్రారంభించారు. పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన నేను.. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి సురక్షితంగా అనిపించిన ప్రదేశంలో ఒంటరిగా నిలబడ్డాను. నా వెనక సైనికులున్నారు. అప్పుడ నేను బహాయ్ గార్డెన్స్‌పై ఉన్న పాలస్తీనా జెండాను ఫోటో తీస్తున్నాను. అప్పటి వరకు ఎవరికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు” అని మైసా ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.
‘‘నేను నా కారు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. పెద్ద శబ్దం వినిపించింది. నా ప్యాంట్ ఏమైనా చిరిగిందా ఏంటి అనుకుంటూ.. అక్కడ నుంచి ఫాస్ట్‌గా వెళ్లాలని భావించాను. కానీ నేను నడవలేకపోతున్నాను. కాలు విపరీతంగా నొప్పి పెడుతుంది. ఏం జరిగింది అని వంగి చూడగా.. నా కాలు చర్మం చీరుకుపోయి.. విపరీతమైన రక్తస్రావం అవుతుంది. అది చూసి నేను భయంతో కేకలు వేశాను. అక్కడ ఉన్న కొందరు నన్ను ఆస్పత్రిలో చేర్చారు’’ అని తెలిపారు. నటి కాలికి తీవ్ర గాయమయ్యింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు.
ఇజ్రాయెల్– పాలస్తీనా మధ్య భీకర పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు పరస్పరం రాకెట్లతో దాడి చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 86 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా దాదాపు 300 మంది గాయపడ్డారని తెలిపింది.
చదవండి: Israel- Palestine: క్షతగాత్రి పాలస్తీనా