మార్కెట్లోకి హాఫ్ గర్ల్‌ఫ్రెండ్
సాక్షి, బెంగళూరు : బెంగళూరు పుస్తక ప్రియుల్ని అలరించేందుకు ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ శుక్రవారం రాత్రి నగర ప్రవేశం చేసింది. ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ రచించిన ఈ పుస్తకం కోసం పాఠకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే..! వారి నిరీక్షణకు తెరదించుతూ పుస్తక రచయిత చేతన్ భగత్ చేతుల మీదుగా నగరంలోని కోరమంగళలోని ఫోరం మాల్లో ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా పుస్తక సారాంశాన్ని క్లుప్తంగా ఆయన వివరించారు.
బీహారీ బాలుడు మాధవ్, ఢిల్లీలోని ధనిక కుటుంబానికి చెందిన బాలిక రియా ప్రేమలో పడటం, ఆ ప్రేమ బంధాన్ని కొనసాగించలేని రియా చివరకు మాధవ్ హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండేందుకు రాజీపడుతుంది. ప్రస్తుత ఆధునిక సమాజంలో వ్యక్తుల మధ్య నెలకున్న సంబంధాల్లో స్వల్ప వ్యత్యాసాన్ని హృద్యంగా పుస్తకీకరించారు.
అందుకే ఈ పుస్తకానికి హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌గా టైటిల్ పెట్టినట్టు ఆయన వెల్లడించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా చేతన్ భగత్ పుస్తకాలు, అందులోని అంశాలపై పోటీలు నిర్వహించారు. అక్కడే సుమారు 200 మంది కొనుగోలుదారులకు చేతన్ భగత్ స్వయంగా సంతకం చేసిన పుస్తకాల్ని అందించారు.