Hanuman Vihari
-
భారత అండర్–23 జట్టులో విహారికి చోటు
న్యూఢిల్లీ: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వర్యంలో జరిగే అండర్–23 ఎమర్జింగ్ కప్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ గాదె హనుమ విహారికి స్థానం లభించింది. ఇటీవలే జరిగిన విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నీలో విహారి ఆరు మ్యాచ్‌ల్లో కలిపి 262 పరుగులు చేశాడు. 15 మంది సభ్యులుగల టీమిండియాకు తమిళనాడు ప్లేయర్ బాబా అపరాజిత్ నాయకత్వం వహిస్తాడు. టోర్నీలో 23 ఏళ్లలోపు ఆటగాళ్లే పాల్గొనాల్సినా... ఏసీసీ నిబంధనలు సవరించి 23 ఏళ్లకుపైగా ఉన్న నలుగురు ఆటగాళ్లు జట్టులో ఉండొచ్చని తెలిపింది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఈనెల 15 నుంచి 26 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. 2013లో చివరిసారి జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో పాక్‌పై నెగ్గి భారత్ విజేతగా నిలిచింది. -
వ్యక్తిగత కారణాలతోనే...
► ఆంధ్రకు మారానన్న విహారి ► హైదరాబాద్ జట్టుకు గుడ్‌బై సాక్షి, హైదరాబాద్: రంజీ క్రికెట్లో అడుగు పెట్టిననాటి నుంచి హైదరాబాద్ తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచిన గాదె హనుమ విహారి ఆంధ్రకు మారుతున్నట్లు ప్రకటించాడు. వచ్చే సీజన్ నుంచి తాను ఆంధ్ర జట్టు తరఫునే బరిలోకి దిగుతానని వెల్లడించాడు. ఈ నెల 25 నుంచి జరగనున్న ఏసీఏ సెలక్షన్స్ టోర్నీలో ఆడనున్నట్లు అతను చెప్పాడు. ‘నేను పుట్టింది కాకినాడలోనే. కుటుంబ కారణాలతో మేమంతా అక్కడికి వెళ్లిపోతున్నాం. ఇలాంటి సమయంలో జట్టు మారడం కూడా తప్పనిసరి అనిపించింది. అందుకే హైదరాబాద్‌ను వదలాలని నిర్ణయించుకున్నా. అక్కడ కూడా మెరుగ్గా రాణిస్తాననే నమ్మకం ఉంది’ అని విహారి అన్నాడు. క్రికెట్లో ప్రాధమిక శిక్షణ నుంచి రంజీ జట్టు కెప్టెన్‌గా ఎదిగే వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తనకు ఎన్నో అవకాశాలిచ్చిందని, హెచ్‌సీతో విభేదాల కారణంగా జట్టు మారుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అతను స్పష్టం చేశాడు. హెచ్‌సీఏ కార్యదర్శి జాన్ మనోజ్‌తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను పేర్కొన్నాడు. హైదరాబాద్, సౌత్‌జోన్ జట్ల తరఫున కలిపి ఆరు సీజన్లలో 40 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన విహారి 55.74 సగటుతో 3066 పరుగులు చేశాడు. 30 వన్డేల్లో 955 పరుగులు చేసిన అతను.. 52 టి20ల్లో 106.93 స్ట్రైక్‌రేట్‌తో 925 పరుగులు సాధించాడు. -
విహారి సెంచరీ
* ఆంధ్రా బ్యాంక్ విజయం * వన్డే నాకౌట్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: హనుమ విహారి (115) సెంచరీ సాధించడంతో ఆంధ్రా బ్యాంక్ 40 పరుగుల తేడాతో డెక్కన్ క్రానికల్ (డీసీ)పై విజయం సాధించింది. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్ జట్లు పోటీపడుతున్న ఈ వన్డే నాకౌట్ టోర్నీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా బ్యాంక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 316 పరుగులు చేసింది. రవితేజ (56), అభినవ్ కుమార్ (53) రాణించారు. డీసీ బౌలర్ షాదాబ్ తుంబి 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన డెక్కన్ క్రానికల్ జట్టు 8 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ప్రణీత్ కుమార్ (96), షాదాబ్ తుంబి (72) జట్టు విజయం కోసం శ్రమించినా ఫలితం లేకపోయింది. ఆంధ్రా బ్యాంక్ బౌలర్ కనిష్క్ నాయుడు 3 వికెట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్‌లో బీడీఎల్ జట్టు 7 వికెట్ల తేడాతో ఎన్స్‌కాన్స్‌పై గెలిచింది. తొలుత ఎన్స్‌కాన్స్ 8 వికెట్లకు 250 పరుగులు చేసింది. అరుణ్ దేవా (95), హుస్సేన్ (56) అర్ధసెంచరీలు చేశారు. బీడీఎల్ బౌలర్లు శ్రవణ్ 4, శివశంకర్ 3 వికెట్లు తీశారు. తర్వాత బీడీఎల్ మూడే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సమర్థ్ (80), కె. సుమంత్ (57 నాటౌట్), రాహుల్ సింగ్ (53), యతిన్ రెడ్డి (46) సమష్టిగా రాణించి జట్టును గెలిపించారు.