భారత అండర్–23 జట్టులో విహారికి చోటు
న్యూఢిల్లీ: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వర్యంలో జరిగే అండర్–23 ఎమర్జింగ్ కప్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ గాదె హనుమ విహారికి స్థానం లభించింది. ఇటీవలే జరిగిన విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నీలో విహారి ఆరు మ్యాచ్‌ల్లో కలిపి 262 పరుగులు చేశాడు. 15 మంది సభ్యులుగల టీమిండియాకు తమిళనాడు ప్లేయర్ బాబా అపరాజిత్ నాయకత్వం వహిస్తాడు.
టోర్నీలో 23 ఏళ్లలోపు ఆటగాళ్లే పాల్గొనాల్సినా... ఏసీసీ నిబంధనలు సవరించి 23 ఏళ్లకుపైగా ఉన్న నలుగురు ఆటగాళ్లు జట్టులో ఉండొచ్చని తెలిపింది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఈనెల 15 నుంచి 26 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. 2013లో చివరిసారి జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో పాక్‌పై నెగ్గి భారత్ విజేతగా నిలిచింది.