2లక్షల ఎకరాల్లో పంట నష్టం
మరిపెడలో 8.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు
హైదరాబాద్: అకాల వర్షం 2 లక్షల ఎకరాల పంటను నాశనం చేసింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రైతన్న కుదేలయ్యాడు. వడగళ్లతో అనేకచోట్ల పంట ధ్వంసమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మండలాల్లోని 889 గ్రామాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రకటించారు. 1.09 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, సజ్జ, నువ్వులు, జొన్న పంటలకు నష్టం వాటిల్లగా, సుమారు 91వేల ఎకరాల్లో పండ్లతోటలు, ఇతర పంటలకు నష్టం జరిగింది. ఆయా జిల్లాల్లో వ్యవసాయ, రెవెన్యూ యంత్రాంగాలు పంటనష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనావేసే పనిలో ఉన్నాయి. వరి, మామిడికే అధిక నష్టం: అకాల వర్షాల కారణంగా ఆహార పంటల్లో వరి, ఉద్యాన పంటల్లో మామిడికే తీవ్రమైన నష్టం వాటిల్లింది.
వరికి 74,382 ఎకరాల్లో, మామిడికి 73,236 ఎకరాల్లో నష్టం జరిగింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 38,507 ఎకరాల్లో, నల్లగొండ జిల్లాలో 33,207 ఎకరాల్లో నష్టం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 19,227 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఉద్యాన పంట ల్లోనూ కరీంనగర్ జిల్లానే అధికంగా నష్టపోయింది. అక్కడ అన్ని ఉద్యాన పంటలు కలిపి 53,859 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. వరంగల్ జిల్లాలో 8,455 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లాలో 6,411 ఎకరాల్లో నష్టం వాటిల్లింది.
మరో ఐదు రోజులు తేలికపాటి వర్షాలు మరో ఐదు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇన్చార్జి డెరైక్టర్ సీతారాం ‘సాక్షి’కి చెప్పారు. అయితే వడగళ్ల వానలు ఉండబోవని ఆయన పేర్కొన్నారు. గత 24 గంటల్లో వరంగల్ జిల్లా మరిపెడలో అత్యధికంగా 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.