భూగర్భ భయం
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే తొలి భూగర్భ చమురు నిల్వ కేంద్రం నిర్మాణం భద్రతా ప్రమాణాల దృష్ట్యా కలవరం కలిగిస్తోంది. అందుకే దీని నిర్మాణం మరింత కాలం సాగేట్టు కనిపిస్తోంది. విశాఖపట్నంలోని డాల్ఫిన్ కొండ గర్భంలో దీనిని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 13 లక్షల టన్నుల సామర్థ్యంతో ప్రతిష్టాత్మక స్థాయిలో నిర్మితమవుతున్న ఈ చమురు నిల్వ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యేట్టు కనిపించడం లేదు. 2011 నాటికే దీన్ని సిద్ధం చేయాలని నిర్ణయించినా, ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు.
సొరంగాల్లో చమురు స్టోరేజీ ట్యాంకులు పూర్తయినా భద్రతాపరమైన సందేహాలు వేధిస్తూ ఉండడంతో నిపుణులకు ఈ ప్రాజెక్టు పూర్తిచేయడం కత్తి మీద సాముగా మారుతోంది. పరీక్షల దశ (ట్రైల్ రన్)కు చేరుకున్నా ఇటీవల గ్యాస్,చమురు పేలుళ్ల ఘటనల నేపథ్యంలో, ఇతర భద్రతాపరమైన అనుమానాలతో భద్రతా ప్రమాణాలు మళ్లీ పెంచాలని నిర్ణయించారు. దీంతో ప్రాజెక్టు వచ్చే ఏడాదికి మళ్లీ వాయిదాపడింది.
ఎన్ని కష్టాలో...
చమురు దిగుమతి విషయంలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని దేశీయ అవసరాలకు సరిపడేట్టు దండిగా క్రూడ్ నిల్వ చేసుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం 2008లో భూగర్భ చమురు నిల్వ కేంద్రాల నిర్మాణానికి పూనుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ ధర ఉన్నప్పుడు భారీగా చమురు కొనుగోలు చేసి దాచాలనేదే ఈ ప్రణాళిక ఉద్దేశం. ఇందులో భాగంగా మంగుళూరు (15 లక్షల టన్నులు), పాడూరు (25 లక్షల టన్నులు), విశాఖపట్నం (13 లక్షల టన్నులు) చమురు నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని 2008లో కేంద్రం నిర్ణయించింది. విశాఖలో చమురు నిల్వకు సురక్షిత ప్రాంతంగా డాల్ఫిన్ కొండను గుర్తించి దీనిని 2011 నాటికి వినియోగంలోకి తేవాలని నిర్ణయించింది. రూ. 1037 కోట్ల వ్యయంతో హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ 2009లో ప్రాజెక్టు పనులు ప్రారంభించింది.
కొండ అడుగుభాగాన ఆరుకిలోమీటర్ల పరిధి లో అయిదు గుహలు నిర్మించడానికి పనులు ప్రారంభించారు. గతేడాది ఇవి పూర్తయ్యాయి. వీటికి లోపలనుంచి ప్రత్యేక రక్షణ కవచాలు నిర్మించారు. వీటిలోనే చమురును నిల్వ చేసేలా ట్యాంకులు తయారుచేశారు. అయిదు ట్యాంకుల చుట్టూ 75 మీటర్ల లోతులో ప్రత్యేక బోర్లు తవ్వి చమురు నిల్వ కేంద్రాలకు కలిపారు. అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విదేశాల నుంచి వచ్చే నౌకలు నేరుగా ఈ ట్యాంకులకు ముడి చమురును పంప్ చేసేట్టు ట్యాంకులు నిర్మించారు. 68 ఎకరాల్లో మూడునెలల కిందట ఫిల్లింగ్ స్టేషన్ పనులు పూర్తిచేశారు. ట్యాంకులను ఈఏడాది జూన్ లేదా జూలైలో ప్రారంభించాలని భావించారు.
కాని భద్రత ప్రమాణాలపై నిపుణులు పునరాలోచనలో పడడంతో ప్రాజెక్టు వెనక్కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన గ్యాస్, చమురు ప్రమాదాల నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించినట్టు తెలియవచ్చింది. ఒకవేళ సొరంగాల్లో అగ్నిప్రమాదాలు జరిగితే నివారించే ఆధునిక సాంకేతిక వ్యవస్థను పునఃసమీక్షించి ప్రమాణాలు రెట్టింపు చేయాలని నిపుణులు భావించిన ట్టు విదితమవుతోంది. దీంతో ప్రాజెక్టు ప్రారంభం మళ్లీ వాయిదా పడినట్లయింది. వచ్చే ఏడాది మార్చి నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.