సల్మాన్ ను వెంటాడుతున్న హిట్ అండ్ రన్ కేసు
న్యూఢిల్టీ: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను 'హిట్ అండ్ రన్' కేసు విడిచిపెట్టేలా కనిపించడం లేదు. 2002లో జరిగిన ఈ కారు ప్రమాదంలో బాధితుడైన నియామత్ షేక్ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేసే సమయంలో తన వాదనలు వినిపించడానికి అవకాశం కల్పించాలని అతడు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశాడు.
కారు ప్రమాదం తనను శాశ్వత వికలాంగుడిగా మార్చిందని, రోజు వారీ కూలీ చేస్తేనే తప్ప బతకలేమని ఆయన విన్నవించారు. తన కుటుంబంలో సంపాదించేది తానేనని, అయితే ఇప్పుడు తాను పనులు చేసే పరిస్థితిలో లేనందున తగిన పరిహారం ఇప్పించాల్సిందిగా కోరాడు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించాల్సిందిగా నియామత్ అభ్యర్థించాడు.
సీఆర్పీసీ 357 ప్రకారం బాధితులకు పరిహారం ఇప్పించే విషయాన్ని దిగువ కోర్టు విస్మరించిందని అతడు పిటిషన్ లో పేర్కొన్నాడు. బాధితుని కుటుంబ సభ్యులు కూడా బాంబే హై కోర్టు సల్మాన్ ను నిర్దోషిగా ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు లో పిటిషన్ వేసారు. 2002 లో సల్మాన్ కారు రోడ్డుపై నిదురిస్తున్న వారిపై దూసుకెళ్లగా ఒకరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.