అయ్యో అంజలి.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు
ఢిల్లీ: సుల్తాన్‌పురి-కంఝావాలా మధ్య కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనలో దారుణ రీతిలో ప్రాణం కోల్పోయిన అంజలి(20) కేసులో పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె ఆల్కాహాల్ తీసుకోలేదని, ఆమె మృతదేహంలో ఆనవాలు కనిపించలేదని స్పష్టం అయ్యింది. అంతేకాదు ఆ ఘటన సమయంలో ఆమె నరకం అనుభవించి ఉంటుందని పోస్ట్‌మార్టం రిపోర్ట్ ద్వారా స్పష్టం అవుతోంది. మొత్తం ఎనిమిది పేజీల ఆ రిపోర్ట్‌లో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెల్లడయ్యాయి.
‘‘రోడ్డుపై కిలోమీటర్ల పొడవునా బాడీని ఈడ్చుకెళ్లారు. శరీరం మట్టి కొట్టుకుపోయింది. ఆమె ఒంటిపై 40కి పైగా గాయాలు అయ్యాయి. పక్కటెముకలు బయటకు వెనుకవైపు పొడుచుకువచ్చాయి. రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో శరీరం మొత్తం కమిలిపోయింది. తల పగిలి మెదడు బయటకు వచ్చి.. అందులో కొంత భాగం మిస్సయ్యింది. వెన్నుముక పూర్తిగా విరిగిపోయిందని రిపోర్ట్‌లో వైద్యులు వెల్లడించారు. తీవ్ర గాయాలతో, రక్త స్రావంతోనే ఆమె మరణించిందని శవ పరీక్ష ద్వారా వైద్యులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో జరిగిన శవ పరీక్ష నివేదికను పోలీసులు స్వీకరించారు. అయితే.. సాధారణ శవ పరీక్ష తర్వాత మరోసారి కెమికల్ అనాలసిస్, బయోలాజికల్ శాంపిల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే తుది ధృవీకరణ చేసినట్లు వైద్యులు ఆ నివేదికలో వెల్లడించారు.
పోలీసుల నివేదిక ప్రకారం.. డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత(జనవరి 1న) స్కూటీపై స్నేహితురాలితో వస్తున్న అంజలి సింగ్‌ను.. వేగంగా వస్తున్న బలెనో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె బాడీని అలాగే కిలోమీటర్ల మేర లాక్కునిపోయింది ఆ కారు. సుల్తాన్‌పురి-కంఝావాలా మధ్య చక్కర్లు కొట్టి.. చివరకు ఆమె మృతదేహాం కారు నుంచి వేరై రోడ్డు మీద పడిపోయింది. కారులో ఉన్న ఐదుగురు ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. ఈ ఘటన ఢిల్లీని కుదిపేయడంతో పాటు దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఘటనపై నిరసనలు వెల్లువెత్తడంతో నిందితులను త్వరగతిన అరెస్ట్ చేసిన పోలీసులు.. మూడు రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. బుధవారం(ఇవాళ) సాయంత్రంతో ఆ కస్టడీ ముగియనుంది. ఇక అత్యాచారం జరిగిందనే కోణాన్ని శవ పరీక్ష కొట్టిపారేసింది.
ఇక బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన డిప్యూటీ ముఖ్యమంత్రి సిసోడియా.. దారుణ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన అంజలి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.