హెచ్‌పీఎస్ జట్లకు హాకీ టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజియన్ ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) బేగంపేట్, ఫ్యూచర్ కిడ్స్ జట్లు సత్తాచాటాయి. హాకీ ఈవెంట్ జూనియర్, సీనియర్ విభాగాల్లో హెచ్‌పీఎస్ జట్లు విజేతలుగా నిలవగా, బాస్కెట్‌బాల్ టోర్నీ సీనియర్, జూనియర్ విభాగాల్లో ఫ్యూచర్ కిడ్స్ జట్లు టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. శనివారం బేగంపేట్‌లో జరిగిన హాకీ టోర్నీ సీనియర్ బాలుర తొలి మ్యాచ్‌లో హెచ్‌పీఎస్ జట్టు 2–1తో అభ్యాస స్కూల్‌పై, రెండో మ్యాచ్‌లో 2–0తో సెయింట్ జోసెఫ్ స్కూల్‌పై గెలుపొందింది.
మరో మ్యాచ్‌లో అభ్యాస 1–0తో సెయింట్ జోసెఫ్‌ను ఓడించింది. రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన హెచ్‌పీఎస్ విజేతగా నిలవగా, అభ్యాస, సెయింట్ జోసెఫ్ జట్లు వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. జూనియర్ బాలుర విభాగంలో హెచ్‌పీఎస్ 7–0తో ఎఫ్కేఎస్పై, రెండో మ్యాచ్‌లో 2–0తో ఎన్ఏఎస్ఆర్పై, మూడో మ్యాచ్‌లో 2–1తో అభ్యాసపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. అభ్యాస జట్టు 2–0తో ఎఫ్కేఎస్పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో 1–1తో ఎన్ఏఎస్ఆర్తో మ్యాచ్‌ను డ్రా చేసుకొని రెండో స్థానాన్ని దక్కించుకుంది.
చాంపియన్స్ ఫ్యూచర్ కిడ్స్ జట్లు
ఈ టోర్నీ బాస్కెట్‌బాల్ ఈవెంట్లో ఫ్యూచర్ కిడ్స్ జట్లు చాంపియన్లుగా నిలిచాయి. సీనియర్ బాలికల ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ 18–10తో ఎన్ఏఎస్ఆర్పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో శ్రేయ (12) టాప్ స్కోరర్. జూనియర్ బాలికల ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ జట్టు 12–3తో హెచ్‌పీఎస్ (బేగంపేట్) జట్టును ఓడించి టైటిల్‌ను సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ అడ్మినిస్ట్రేటర్ అలేకందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.