హీరో డీజిల్ బైక్!
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ కంపెనీ త్వరలో డీజిల్ బైక్‌ను మార్కెట్లోకి తెస్తోంది. ఆర్ఎన్టీ 150 సీసీ పేరుతో కాన్సెప్ట్ డీజిల్ బైక్ కంపెనీ బుధవారం ఆవిష్కరించింది. దీంతో పాటు హైబ్రిడ్ స్కూటర్, మరో మూడు మోడళ్లను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. డీజిల్ బైక్ మినహా ఇతర మోడళ్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి తెస్తామని హీరో మోటోకార్ప్ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ చెప్పారు. ఈ కొత్త మోడళ్లలో మూడు మోడళ్లు -ఆర్ఎన్టీ డీజిల్ బైక్, హైబ్రిడ్ స్కూటర్ లీప్, 250 సీసీ స్పోర్ట్స్ బైక్ హెచ్‌ఎక్స్‌ఆర్250ఆర్లు పూర్తిగా కొత్తవని వివరించారు.
వీటితో పాటు 110 సీసీ స్కూటర్ డాష్, 150 సీసీ బైక్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్-ఇవి రెండూ ప్రస్తుత ప్లాట్‌ఫామ్‌లపైనే తయారు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 150 సీసీ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ బైక్‌ను, రెండో క్వార్టర్లో డాష్ స్కూటర్‌ను అందిస్తామని వివరించారు. 2013-14 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో హైబ్రిడ్ స్కూటర్‌ను, 250 సీసీ స్పోర్ట్స్ బైక్‌ను మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు.
డీజిల్ బైక్‌పై మరింత కసరత్తు
డీజిల్ ఇంజిన్ బైక్‌పై మరింత రీసెర్చ్ చేయాల్సి ఉందని పవన్ ముంజాల్ వివరించారు. ఈ డీజిల్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు మరింత సమయం పడుతుందని వివరించారు. రానున్న కాలంలో ఈ బైక్‌కు యాక్సెసరీలు అందిస్తామని, మరిన్ని వేరియంట్లను తెస్తామని, భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ బైక్‌ను విక్రయిస్తామని పేర్కొన్నారు. మంచి మైలేజీ ఇచ్చేలా, టూ-వీల్ డ్రైవ్ తదితర ఫీచర్లతో ఈ బైక్‌ను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. పెట్రోల్‌తోనూ, కరెంట్తోనూ నడిచే హైబ్రిడ్ స్కూటర్ లీప్‌ను మొదటగా పాశ్చాత్య దేశాల్లో మార్కెట్ చేస్తామని, ఆ తర్వాత భారత్‌లోకి తెస్తామని వివరించారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే లేదా ట్యాంక్ ఫుల్ చేస్తే 340 కి.మీ. దూరాన్ని ఈ స్కూటర్ ప్రయాణిస్తుందని వివరించారు.