మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రపంచంలోని ప్రముఖ ఎంటర్టైన్మెంట్, గేమింగ్, డిజిటల్ అండ్ మీడియా, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాల దిగ్గజ కంపెనీలు, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో జరిగే ఇండియా జాయ్ కార్యక్రమానికి మరోసారి హైదరాబాద్ నగరం వేదిక కానున్నది. నాలుగు రోజులపాటు జరగనున్న ఇండియా జాయ్-2019 కార్యక్రమం నవంబర్ 20వ తేదీ నుంచి 23 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుని ముఖ్యఅతిధిగా ఆహ్వానిస్తూ ఇండియా జాయ్ ప్రతినిధులు ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఇండియా జాయ్ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారని నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
మీడియా, ఎంటర్టైన్మెంట్, గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాలకు చెందిన వివిధ దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులుఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గేమింగ్ యానిమేషన్ , మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ రంగాలకు హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు ‘ఇమేజ్ టవర్’ ను నిర్మిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఇమేజ్ టవర్ ఈ రంగాలకు ఒక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు’గా పనిచేస్తుందని, ఇందులో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల ముఖ్య ప్రతినిధులు హాజరుకానున్న ఈ సమావేశంలో ఆయా రంగాలకు హైదరాబాద్ నగరంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మీడియా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, వినోద రంగాలకు సంబంధించి అద్భుతమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ సినిమాలకు, చోటా బీమ్ వంటి గొప్ప కార్టూన్ సిరీస్ రూపకల్పన హైదరాబాద్ నగరంలోనే జరిగిందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్, దేశీ టూన్స్, విఎఫ్ఎక్స్ సదస్సు, ఇన్ఫ్లుయెన్సర్ కాన్ఫరెన్స్, ఈ- స్పోర్ట్స్ వంటి పలు కార్యక్రమాలను ఈ నాలుగు రోజుల్లో చేపట్టనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మొత్తం వివిధ దేశాల నుంచి సుమారు 30 వేల మంది సందర్శకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు.
#IndiajoyinFestival is a prestigious platform for Digital, Media & Entertainment Corporations to collaborate & innovate. With more than 30,000 visitors, the 4-day conclave is expected to serve as a springboard for Indian media, entertainment companies on the world stage.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 11, 2019