పెద్ద మనస్సు చాటుకున్న ఎస్బీఐ!
హైదరాబాద్: ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పెద్ద మనస్సు చాటుకుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్)లో భాగంగా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు రూ. 22.23 లక్షలు విరాళమిచ్చింది. నిరుపేద కుటుంబాలకు వైద్య సదుపాయం అందించేందుకు మొబైల్ క్లినిక్ ఏర్పాటుచేయడానికి హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ హ్యుమన్ వెల్ఫేర్ (హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ)కు ఈ విరాళం అందజేసింది. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ రజ్నిష్ కుమార్ ఈ మేరకు చెక్కును హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ డైరెక్టర్ మహ్మద్ రఫీయుద్దీన్‌కు అందజేశారు.
ఈ మొబైల్ క్లినిక్ వచ్చేవారం నుంచి సేవలు అందించనుంది. మురికివాడల్లోని 500 మందికి ప్రతిరోజూ ఉచితంగా వైద్యసేవలు అందించనుంది. ఈ మొబైల్ క్లినిక్‌లో రిసెప్షన్ డెస్క్, డాక్టర్ క్యాబిన్, లాబోరేటరి, ఔషధాలు దుకాణం తదితర సేవలు అందుబాటులో ఉంటాయి. ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ సీఎస్ఆర్లో భాగంగా ఇప్పటికే పలు పారిశుద్ధ్య, వైద్య, విద్య ప్రాజెక్టుల కోసం స్వచ్ఛంద సంస్థలకు రూ. 10.50 కోట్ల మేర విరాళాలు అందజేసిందని అధికారులు తెలిపారు. డిజిటలైజేషన్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు గ్రామాలను దత్తత తీసుకున్నట్టు తెలిపారు.