ఏసీబీ వలలో మరో అవినీతి చేప
విజయవాడ: ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారిని మాటువేసి పట్టుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూటబెట్టారన్న ఆరోపణలపై శ్రీకాకుళం రవాణా శాఖ అధికారి హైమారావు ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నల్గొండ, ఏలూరు, రాజమండ్రి, వైఎస్సార్ జిల్లాల్లోని ఆయన ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏసీబీ డీజీ ఆర్టీ ఠాకూర్ ఆదేశాల మేరకు ఈ సోదాలు నిర్వహించారు.
హైమారావు భార్య పేరిట రాజమండ్రిలో విలువైన నివాస స్థలం, రాజమండ్రి, నల్గొండల్లో 11 ఇళ్ల స్థలాలు, ఏలూరు మండలం కొప్పాకలో 10 ఎకరాల వ్యవసాయ భూమి, విజయవాడ, విశాఖపట్నంలో కుమార్తెల పేరిట రెండు ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో మొత్తం అరకిలో బంగారం, 5 కిలోల వెండి, రూ.2.8లక్షల నగదు, రూ.13 లక్షల విలువైన కారు, 12 మద్యం సీసాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరంలోని పలు బ్యాంకుల్లో మూడు లాకర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల విలువ రూ.20 కోట్లకు పైగానే ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.