IKC
-
స్వాహాకు మూల్యం !
సాక్షి, నల్లగొండ:మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే పావలా వడ్డీని చౌటుప్పల్ మండలంలో స్వాహా చేసిన పది మంది ఐకేపీ ఉద్యోగులకు చార్జ్‌మెమోలు జారీ అయ్యాయి. పావలా వడ్డీ ‘స్వాహా’ శీర్షికన ఈ ఏడాది సెప్టెంబర్ 20న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందిం చారు. విచారణ జరిపి అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించుకున్న తర్వాత సదరు సిబ్బందికి తాఖీదులు ఇచ్చారు. అభియోగాలపై వివరణ ఇవ్వాలని ఈనెల 9న ఉత్తర్వులు జారీ చేశారు. ‘సాక్షి’ కథనంపై నెలన్నర రోజులుగా, జిల్లాలోని ఇతర మండలాలకు చెందిన ఐకేపీ ఆడిటర్లతో విచారణ చేయించారు. వీరు చౌటుప్పల్ లోనిఐకేపీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించడంతో పాటు, గ్రామగ్రామాన తిరిగి, మహిళా సంఘాల సభ్యులను కలిసి విచారించారు. సంఘాల రికార్డులను తనిఖీ చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. వాటి ఆధారంగా చౌటుప్పల్ మండలంలో ఏపీఎంలుగా, సీసీలుగా పనిచేసిన 8మంది ఉద్యోగులతో పాటు, ఇద్దరు వీబీకేలకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి అంజయ్య పేరిట చార్జ్‌మెమోలు జారీ చేశారు. ఇందులో వి.కృష్ణయ్య (ఏపీఎం,నార్కట్‌పల్లి), సుధారాణి (క్లస్టర్ ఏపీఎం, వలిగొండ), శ్రీనివాస్ (క్లస్టర్ ఏపీఎం, భువనగిరి), లక్ష్మీ (ఏపీఎం, మేళ్లచె ర్వు), వెంకటేశం (ఏపీఎం, చిట్యాల), నీరజ (ఏపీఎం,చౌటుప్పల్), కె.సత్తిరెడ్డి (ఆడిటర్, చౌటుప్పల్), కె.అలివేలు (సీసీ, చౌటుప్పల్)లు ఉన్నారు. ఇంటెలిజెన్సు విచారణ ఈ అవినీతి వ్యవహారంపై ‘ సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఇంటెలిజెన్స్ ఎస్పీ స్పందించారు. పావలా వడ్డీ స్వాహాపై విచారణ జరిపించారు. దాదాపు రూ.39 లక్షలు పక్కదారి పట్టినట్టు ఇంటెలిజెన్సు విచారణలో తేలినట్టు విశ్వసనీయ సమాచారం. సంజాయిషీ తర్వాత, మరో వారం రోజుల్లో సస్పెన్షన్ల పర్వం మొదలుకానుందని తెలుస్తోంది. ఆరోపణలు వచ్చిన సిబ్బందిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపామని, ఈ మేరకు చార్జ్‌మెమోలు జారీ చేశామని డీఆర్డీఏ పీడీ ఆర్.అంజయ్య ‘సాక్షి’కి తెలిపారు. అసలేం జరిగిందంటే.... చౌటుప్పల్ మండలంలోని మహిళా సంఘాలకు 2008కు ముందు మూడేళ్ల పావలా వడ్డీ రాలేదు. 2009లో ఒకేసారి రూ.84లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ కొద్ది రోజులకే 2009 ఏడాదికి సంబంధించిన పావలా వడ్డీ మంజూరైంది. ఈ సమయంలో అక్కడ పనిచేసిన ఏపీఎంలు, సీసీలు, కొందరు మహిళా సంఘాల లీడర్లతో కుమ్మక్కై, మొదట వచ్చిన రూ.84 లక్షల పావలా వడ్డీలో, సగానికి పైగా స్వాహా చేశారు. నిరక్షరాస్యులైన సంఘాల సభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, వారి సంఘాల ఖాతాల్లో వేశారు. డబ్బులు పొరపాటున మీ ఖాతాలో పడ్డాయి, వేరే సంఘం వారివని చెప్పి, వారితో సంతకాలు చేయించుకుని, వారితోనే బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేయించి తీసుకున్నారు. ఇలా ఎవరికీ వారు స్వాహా పర్వానికి తెరలేపి సుమారు రూ.40 లక్షలను స్వాహా చేశారనేది విశ్వసనీయ సమాచారం. అయితే, బ్యాంకుల నుంచి వడ్డీని డ్రా చేసినట్టు రికార్డులు ఉన్నప్పటికీ, మహిళా సంఘాల రికార్డుల్లో ఎక్కడా రాయలేదు. యూసీలు లేవు. దీంతో సదరు ఉద్యోగులకు వారు పనిచేసిన కాలంలో, రికార్డులు లేని సొమ్ము గురించి సంజాయిషీ ఇవ్వాలని కోరారు. -
గన్నీ ఎట్లా?
- 1.99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు - ఇప్పటివరకు 58 లక్షల గోనె సంచుల పంపిణీ - ఇంకా 25 లక్షల గోనె సంచులు అవసరం - గన్నీ సంచుల కొరతతో కొనుగోలు కేంద్రాల్లో భారీగా పేరుకుపోయిన ధాన్యం నిల్వలు - మహిళా సంఘాల ఆందోళన మిర్యాలగూడ : జిల్లాలోని ఐకేపీ, పీఎసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గోనె(గన్నీబ్యాగులు) సంచుల కొరత ఏర్పడింది. దీంతో కొనుగోలు కేంద్రాలన్నీ ధాన్యం రాశులతో నిండిపోయాయి. కొనుగోలు కేంద్రాలలో వేలాది బస్తాల ధాన్యం కాంటాలు వేయకుండా ఉన్నాయి. కాంటాలు నిలిచిపోవడంతో రైతులు ఐకేపీ కేంద్రాలలోని ధాన్యం తిరిగి తీసుకెళ్లి మిల్లుల వద్ద తక్కువ ధరకు విక్రయించుకుంటున్నారు. గోనె సంచులు సరఫరా చేయడంలో అధికార యం త్రాంగం పూర్తిగా విఫలమైంది. ఏ మేరకు గోనె సంచులు అవసరం ఉన్నాయో, ఎంత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందో అనే విషయాన్ని అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారు. కాగా కేవలం రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగా అధికారుల అంచనాలకు మించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. జిల్లాలో ఇప్పటి వరకు 58 లక్షల గోనె సంచులు పంపిణీ చేశారు. అయినా ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలలో ధాన్యం నిల్వలు ఉన్నందువల్ల ఇంకా 25 లక్షల గోనె సంచుల అవసరం ఉంది. సరిపడా గోనె సంచులు సకాలంలో అందకపోవడం వల్ల మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ఐకేపీ కేంద్రాల నిర్వహకులు గోనె సంచుల కోసం అధికారులు, గోదాముల చుట్టూ తిరుగుతున్నారు. కొనుగోళ్ల లక్ష్యం పూర్తి రబీ సీజన్లో జిల్లాలో 2.50 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. కాగా 7.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. కాగా ఐకేపీ, పీఎసీఎస్ కేంద్రాల ద్వారాప్రభుత్వం రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కాగా ఇప్పటి వరకు జిల్లాలో 151 ఐకేపీ కేంద్రాలు, 99 పీఎసీఎస్ కేంద్రాలు మొత్తం 250 కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోళ్లు చేశారు. ఐకేపీ కేంద్రాల ద్వారా ఈ నెల 4వ తేదీ నాటికే 1,08,468 మెట్రిక్ టన్నులు, పీఎసీఎస్ కేంద్రాల ద్వారా 90,862 మెట్రిక్ టన్నుల ధాన్యం మొత్తం 1,99,330 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కాగా ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన ధాన్యం లక్ష్యం పూర్తయింది. అయినా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రాశులు నిల్వ ఉండటం వల్ల కొనుగోళ్లు చేస్తున్నారు. అంచనాకు మించి.. ధాన్యం ఐకేపీ, పీఎసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అంచనాకు మించిన ధాన్యం రావడం వల్ల గోనె సంచుల కొరత ఏర్పడింది. దాంతో పాటు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లలో మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపకపోవడం వల్ల రైతులు ఎక్కువగా మద్దతు ధర క్వింటాకు రూ.1400 వస్తుందని భావించి ఐకేపీ, పీఎసీఎస్ కేంద్రాలలో ధాన్యం విక్రయించుకోవడానికి మొగ్గు చూపారు. దాంతో రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకముందే ప్రభుత్వ కొనుగోళ్ల లక్ష్యం పూర్తయింది. ఐకేపీ, పీఎసీఎస్ కేంద్రాలకు అనుకున్న దాని కంటే ఎక్కువగా ధాన్యం రావడం వల్ల గోనె సంచుల కొరత ఏర్పడింది. భారీగా ధాన్యం నిల్వలు గోనె సంచుల కొరత కారణంగా ఐకేపీ కేంద్రాలలో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. మిర్యాలగూడ మండలంలోని తడకమళ్ల, తక్కెళ్లపాడు, ఊట్లపల్లి, మైనంవారిగూడెం, కాల్వపల్లి, దొండవారిగూడెం, గూడూరు, గోగువారిగూడెం, వాటర్ ట్యాంకుతండా, వేములపల్లి మండలంలోని మొల్కపట్నం, సల్కునూరు, రావులపెంట, త్రిపురారం మండలంలోని అప్పలమ్మగూడెం, తిమ్మాపురం, నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి, దాసారం, కల్లూరు, గుడుగుంట్లపాలెం గ్రామాలలో ధాన్యం రాశుల నిల్వలు ఉన్నాయి. కాగా పది రోజులకు పైగా కాంటాలు కాకుండా ధాన్యం నిల్వలు ఉండటం వల్ల కొంత మంది రైతులు ఐకేపీ కేంద్రాల నుంచి తీసుకెళ్లి మిల్లుల్లో తక్కువ ధరకైనా విక్రయించుకుంటున్నారు. గోనె సంచులు తెప్పిస్తాం - వరకుమార్, సివిల్ సప్లయీస్ డీఎం, నల్లగొండ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గోనె సంచుల కొరత ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో 58 లక్షల గోనె సంచులు ఐకేపీ, పీఎసీఎస్ కేంద్రాలలో పంపిణీ చేశాం. వరంగల్ నుంచి గోనె సంచులు తెప్పిస్తున్నాం. జిల్లాకు ఇంకా 25 లక్షల గోనె సంచులు అవసరం ఉందని ప్రతిపాదనలు పెట్టాం. గోనె సంచులు రాగానే పంపిణీ చేస్తాం. జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు లక్ష్యం పూర్తయింది. -
ఉంటుందా..? ఊడుతుందా?
నల్లగొండ : జిల్లావ్యాప్తంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 10వేల మంది ఉన్నారు. దీంట్లో కాంట్రాక్టు ఉద్యోగులు జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరంతా కూడా ఐకేపీ, ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక..ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి శాఖలో ఉన్నారు. నాలుగో తరగతి శ్రేణిలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. 104, 108, ఆరోగ్యశ్రీ పథకంతోపాటు ఐదు మున్సిపాలిటీల్లో వెయ్యి మంది వరకు స్వీపర్లుఉంటారు. వీరితోపాటు వైద్యఆరోగ్యశాఖలో ఏఎన్ఎంలు, జీఎంలు, పశు సంవర్థక శాఖలో అంటెండర్లతోపాటు, సంక్షేమ శాఖల హాస్టళ్లలో కుక్‌లు, కామాటీలు, వాచ్మన్లు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బంది, ఏపీఎంఐపీ, ఉద్యావనశాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉద్యోగులున్నారు. రాష్ర్టపతి పాలనలో జీఓ 84 జారీ.. రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు సంబంధించి జీఓ నెం. 84 జారీ చేశారు. దీని ప్రకారం జూన్ 30వ తేదీ వరకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని, అప్పటివరకు ఉమ్మడి రాష్ట్రం ఖజానా ద్వారానే వారి జీతభత్యాల చెల్లింపులు ఉంటాయని జీఓలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం పైనే ఆ ఉద్యోగుల కొనసాగింపు ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం జారీచేసిన జీఓ ప్రకారం.. మరి కొద్దిరోజుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఒప్పందం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ ఏజెన్సీలను రెన్యువల్ చేస్తూ ఉద్యోగుల సర్వీసు కాలాన్ని పొడిగిస్తే తప్ప జూలై 1 నుంచి వారు పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే జిల్లాలో వేలాది మంది ఉద్యోగుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. వీరికి మినహాయింపు ఇచ్చే అవకాశం... ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉపాధి హామీ పథకం, ఐకేపీలో పెద్దసంఖ్యలో పనిచేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ పథకాల అమల్లో భాగంగా నియమితులైన ఉద్యోగులను కూడా మినహాయించి రెగ్యులర్ పోస్టులకు వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఈ కోవకు చెందినవారిలో ఎక్కువగా అటెండర్లు, స్వీపర్లు, కుక్‌లు, కామాటీలు, వాచ్మన్లు, సెక్యూరిటీ గార్డులు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు ఉన్నారు. ఇలాంటివారు జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు, పశుసంవర్థక శాఖ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, విద్యుత్ శాఖ, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నారు. సేవల రద్దుపై ఆదేశాలు... గవర్నర్ జారీ చేసిన జీఓ ప్రకారంగా పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న 56మంది అటెండర్ల సేవలను ఈ నెల 30వ తేదీ తర్వాత వినియోగించుకోవద్దని ఆ శాఖ జాయింట్ డైరక్టర్ డివిజన్‌స్థాయి ఏడీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఏడీలకు ఈ ఆదేశాలు వె ళ్లాయి. దీంతో అటెండర్లలో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇదిలాఉంటే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని నమ్మబలికిన ఏజెన్సీలు నిరుద్యోగుల నుంచి వేల రూపాయలు వసూలు చేశాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ఇప్పడా ఆ చిన్నజీవుల పరిస్థితి ఏమిటన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి ఎనిమిదేళ్లుగా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ హామీని వెంటనే అమలుచేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. చాలామంది ఉద్యోగస్తులు, వారి వయోపరిమితి దాటినందున వేరొక ఉద్యోగాలకు అర్హులయ్యే అవకాశం లేదు. వీరిని పర్మనెంట్ చేయకుంటే వందలాది కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి ఉంది. - సీహెచ్.సంజీవ్ కుమార్, తెలంగాణ టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఈ ఉద్యో గుల పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. అయితే వీరిని కొనసా గిస్తారా..తొలగిస్తారా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. కొత్త రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తా మని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీపైనే ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులను కొనసాగించాలి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలి. 2011నుంచి తక్కువ జీతాలతో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తే వేలాది కుటుంబాలు వీధిన పడతాయి. ఉద్యోగులకు ప్రభుత్వమే న్యాయం చేయాలి. - పి.వేణు, డేటా ఎంట్రీ ఆపరేటర్, పశుసంవర్థక శాఖ ప్రధానశాఖల్లోని సిబ్బంది వివరాలు.. ప్రభుత్వ శాఖ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగులు పశుసంవర్థక శాఖ - 72 డ్వామా 600 150 ఐకేపీ 350 - పంచాయతీరాజ్ - 60 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ - 156 మున్సిపాలిటీలు - 800 సంక్షేమ హాస్టళ్లు - 100 మహాత్మాగాంధీ యూనివర్సిటీ - 123 ఆరోగ్యశ్రీ - 127 రాజీవ్ విద్యామిషన్ - 100 గృహ నిర్మాణ శాఖ - 223 విద్యుత్‌శాఖ - 1000