గన్నీ ఎట్లా? | Limited rice should be purchased in IKC | Sakshi
Sakshi News home page

గన్నీ ఎట్లా?

Published Sat, May 9 2015 12:44 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

గన్నీ ఎట్లా? - Sakshi

గన్నీ ఎట్లా?

- 1.99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు
- ఇప్పటివరకు 58 లక్షల గోనె సంచుల పంపిణీ
- ఇంకా 25 లక్షల గోనె సంచులు అవసరం
- గన్నీ సంచుల కొరతతో కొనుగోలు కేంద్రాల్లో భారీగా పేరుకుపోయిన ధాన్యం నిల్వలు
- మహిళా సంఘాల ఆందోళన
మిర్యాలగూడ :
జిల్లాలోని ఐకేపీ, పీఎసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గోనె(గన్నీబ్యాగులు) సంచుల కొరత ఏర్పడింది. దీంతో కొనుగోలు కేంద్రాలన్నీ ధాన్యం రాశులతో నిండిపోయాయి. కొనుగోలు కేంద్రాలలో వేలాది బస్తాల ధాన్యం కాంటాలు వేయకుండా ఉన్నాయి. కాంటాలు నిలిచిపోవడంతో రైతులు ఐకేపీ కేంద్రాలలోని ధాన్యం తిరిగి తీసుకెళ్లి మిల్లుల వద్ద తక్కువ ధరకు విక్రయించుకుంటున్నారు. గోనె సంచులు సరఫరా చేయడంలో అధికార యం త్రాంగం పూర్తిగా విఫలమైంది. ఏ మేరకు గోనె సంచులు అవసరం ఉన్నాయో, ఎంత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందో అనే విషయాన్ని అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారు.

కాగా కేవలం రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగా అధికారుల అంచనాలకు మించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది.  జిల్లాలో ఇప్పటి వరకు 58 లక్షల గోనె సంచులు పంపిణీ చేశారు. అయినా ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలలో ధాన్యం నిల్వలు ఉన్నందువల్ల ఇంకా 25 లక్షల గోనె సంచుల అవసరం ఉంది. సరిపడా గోనె సంచులు సకాలంలో అందకపోవడం వల్ల మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ఐకేపీ కేంద్రాల నిర్వహకులు గోనె సంచుల కోసం అధికారులు, గోదాముల చుట్టూ తిరుగుతున్నారు.

కొనుగోళ్ల లక్ష్యం పూర్తి
రబీ సీజన్‌లో జిల్లాలో 2.50 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. కాగా 7.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. కాగా ఐకేపీ, పీఎసీఎస్ కేంద్రాల ద్వారాప్రభుత్వం రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కాగా ఇప్పటి వరకు జిల్లాలో 151 ఐకేపీ కేంద్రాలు, 99 పీఎసీఎస్ కేంద్రాలు మొత్తం 250 కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోళ్లు చేశారు. ఐకేపీ కేంద్రాల ద్వారా ఈ నెల 4వ తేదీ నాటికే 1,08,468 మెట్రిక్ టన్నులు, పీఎసీఎస్ కేంద్రాల ద్వారా 90,862 మెట్రిక్ టన్నుల ధాన్యం మొత్తం 1,99,330 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కాగా ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన ధాన్యం లక్ష్యం పూర్తయింది. అయినా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రాశులు నిల్వ ఉండటం వల్ల కొనుగోళ్లు చేస్తున్నారు.

అంచనాకు మించి.. ధాన్యం
ఐకేపీ, పీఎసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అంచనాకు మించిన ధాన్యం రావడం వల్ల గోనె సంచుల కొరత ఏర్పడింది. దాంతో పాటు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌లలో మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపకపోవడం వల్ల రైతులు ఎక్కువగా మద్దతు ధర క్వింటాకు రూ.1400 వస్తుందని భావించి ఐకేపీ, పీఎసీఎస్ కేంద్రాలలో ధాన్యం విక్రయించుకోవడానికి మొగ్గు చూపారు. దాంతో రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకముందే ప్రభుత్వ కొనుగోళ్ల లక్ష్యం పూర్తయింది. ఐకేపీ, పీఎసీఎస్ కేంద్రాలకు అనుకున్న దాని కంటే ఎక్కువగా ధాన్యం రావడం వల్ల గోనె సంచుల కొరత ఏర్పడింది.

భారీగా ధాన్యం నిల్వలు
గోనె సంచుల కొరత కారణంగా ఐకేపీ కేంద్రాలలో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. మిర్యాలగూడ మండలంలోని తడకమళ్ల, తక్కెళ్లపాడు, ఊట్లపల్లి, మైనంవారిగూడెం, కాల్వపల్లి, దొండవారిగూడెం, గూడూరు, గోగువారిగూడెం, వాటర్ ట్యాంకుతండా, వేములపల్లి మండలంలోని మొల్కపట్నం, సల్కునూరు, రావులపెంట, త్రిపురారం మండలంలోని అప్పలమ్మగూడెం, తిమ్మాపురం, నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి, దాసారం, కల్లూరు, గుడుగుంట్లపాలెం గ్రామాలలో ధాన్యం రాశుల నిల్వలు ఉన్నాయి. కాగా పది రోజులకు పైగా కాంటాలు కాకుండా ధాన్యం నిల్వలు ఉండటం వల్ల కొంత మంది రైతులు ఐకేపీ కేంద్రాల నుంచి తీసుకెళ్లి మిల్లుల్లో తక్కువ ధరకైనా విక్రయించుకుంటున్నారు.

గోనె సంచులు తెప్పిస్తాం - వరకుమార్, సివిల్ సప్లయీస్ డీఎం, నల్లగొండ
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గోనె సంచుల కొరత ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో 58 లక్షల గోనె సంచులు ఐకేపీ, పీఎసీఎస్ కేంద్రాలలో పంపిణీ చేశాం. వరంగల్ నుంచి గోనె సంచులు తెప్పిస్తున్నాం. జిల్లాకు ఇంకా 25 లక్షల గోనె సంచులు అవసరం ఉందని ప్రతిపాదనలు పెట్టాం. గోనె సంచులు రాగానే పంపిణీ చేస్తాం. జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు లక్ష్యం పూర్తయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement