‘కడియం’ వ్యాఖ్యలు అనైతికం
సాక్షి, సిటీబ్యూరో: ఖమ్మం జిల్లాలో మహిళా ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీరుపై ఉపాధ్యాయ సంఘాలు విరుచుకు పడ్డాయి. ఒక వైపు కుటుంబం.. మరోవైపు సమాజ బాధ్యతలు విజయవంతంగా కొనసాగిస్తున్న మహిళా టీచర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని పీఆర్టీయూ హైదరాబాద్ శాఖ పేర్కొంది.
సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు బి. మధుసూదన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ టి. తిరుపతి రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం తగదని, వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం మాటలు తీవ్ర మనోవేదన కలిగించాయని, తక్షణమే మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని టీపీయూఎస్ రాష్ట్ర కార్యదర్శి నర్రా భూపతిరెడ్డి డిమాండ్ చేశారు.
ఆందోళనలు చేపడతాం: పాఠశాలలను బలోపేతం చేయకుండా ఉపాధ్యాయులను నిందిస్తున్న కారణంగానే ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల శాతం పడిపోతోందని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గం ధ్వజమెత్తింది. ప్రభుత్వం ఉదాసీనతతోనే భవిష్యత్ తరాలు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను టీచర్ల నెత్తిన రుద్దితే.. డిప్యూటీ సీఎం వైఖరికి నిరసనగా ఆందోళన చేస్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండల్ రెడ్డి, ప్రధానకార్యదర్శి మనోహర్ రాజు, ఉపాధ్యక్షులు రవీందర్ హెచ్చరించారు.