కృష్టుడిలా నాట్యం ఆడిన ముస్లిం డ్యాన్సర్
కొల్కత: పశ్చిమ బెంగాల్లో ఓ ముస్లిం డ్యాన్సర్ శ్రీ కృష్ణుడి పాత్రలో నాట్యం ఆడి మైమరిపించాడు. రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సిస్టర్ నివేదిత 150 వ జయంతి వేడుకల్లో కృష్ణ లీలలు, దశావతారాలను నాటక రూపంలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనల్లో పాల్గొన్న ఇమ్రామ్ షైక్ కృష్ణునిలా నాట్యం ఆడి మతసామరస్యాన్ని చాటుకున్నాడు. అస్సాంకు చెందిన రంగపార డ్యాన్స్ అకాడమీలో సభ్యుడైన ఇమ్రామ్ నాల్గొరోజు ప్రదర్శన వేడుకల్లో దశావతార, కృష్ణలీలాలో కృష్ణుడిలా నాట్యం ఆడాడు.
ఇమ్రామ్ను హిందూ ప్రోగ్రామ్లో పాల్గొనడంపై మీడియా ప్రశ్నించగా నేను నటున్ని, నటునికి మతాలు,కులాలతో సంబంధం ఉండకూడదని సమాధానమిచ్చాడు. రామకృష్ణ, వివేకానందలు మతాలను ప్రోత్సహించలేదని, భారత దేశ ఐక్యతను, మానవ విశ్వాసాలను బోధించారని 18 ఏళ్ల యువ డ్యాన్సర్ తెలిపాడు. మానవత్వమే ఒక మంచి మతమని దానికి మించింది ఏది లేదని ఇమ్రామ్ పేర్కొన్నాడు.