అవని ధరలు ఆకాశానికి..
సత్తెనపల్లి:భూముల విలువల పెంపునకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో శనివారం నుంచి ధరలు భారీగా పెరగనున్నాయి. 2013 తరువాత భూముల ధరలు ప్రభుత్వం పెంచలేదు. రిజిస్ట్రేషన్ శాఖ ధరలతో పోల్చుకుంటే మార్కెట్ విలువ రెట్టింపుగా ఉంది. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం, ఖాజానాకు ఆదాయం సమకూర్చే శాఖల్లో ఒకటైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా భూముల విలువలు పెంచి తద్వారా ఆదాయం పొందాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గ్రామస్థాయి నుంచి పట్టణం వరకు ధరల పెంపు ప్రతిపాదనలను అధికారులు మార్కెట్ విలువ రివిజన్ కమిటీ చైర్మన్, జిల్లా సంయుక్త కలెక్టర్‌కు సమర్పించారు. సబ్ రిజిస్ట్రార్ పెంపు ప్రతిపాదనలకు జేసీ ఆమోద ముద్ర వేశారు.
పెంచిన విలువలపై ప్రజలు అభ్యంతరాలు తెలిపేందుకు రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో పొందుపరిచినా ప్రజల నుంచి పెద్దగా అభ్యంతరాలు రాలేదు. దీంతో జేసీ ఆమోదించిన ధరలే ఆగస్టు 1 నుంచి అమలు కానున్నాయి. అయితే రాజధాని కోర్ ఏరియా పరిధిలోని 29 గ్రామాల్లో భూముల ధరల పెంపు లేదు. మిగతా చోట్ల వ్యాల్యూని బట్టి 20 శాతం నుంచి 100 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. విలువలను నిర్ణయించింది ఇలా.. భూములను గ్రామీణ, పట్టణ ప్రాంతాలుగా విభజించి ప్రతిపాదించారు. గ్రామాల్లో మెట్ట, మాగాణి, తోటలు, నివాస స్థలాలుగా మారనున్న వ్యవసాయ భూములు, రహదారికి ఆనుకుని, సమీపాన ఉన్న, నివాస స్థలాల ప్రాతిపదికను పెంచారు. పట్టణంలో నివాస స్థలాలు, వాణిజ్య సముదాయాలు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న, స్థిరాస్థి వ్యాపారం బాగా జరుగుతున్న ప్రాంతాలు, ఇళ్ల స్థలాలు అనే ప్రాతిపదికన ధరలను నిర్ణయించారు.
ప్రభుత్వ ఖజానాకు రూ.120 కోట్లు
కొత్తపేట(గుంటూరు): జిల్లావ్యాప్తంగా 32 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలు ఉన్నాయి. ప్రభుత్వం లెక్కల ప్రకారం రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ నెలాఖరుకు రూ.120 కోట్ల ఆదాయం లక్ష్యం చేరవచ్చని అంచనా వేస్తున్నారు. గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని ఎనిమిది సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రభుత్వ లక్ష్యం రూ.40 కోట్లు ఇవ్వగా, మొదటి, రెండు వారాలు రూ.10 కోట్లు, మూడోవారం రూ.14 కోట్లు ఆర్జించగా, చివరివారం రూ.18 కోట్ల ఆదాయాన్ని పొందవచ్చని డీఐజీ బి.సత్యనారాయణ విలేకరులకు తెలిపారు.