ఐరాస సంస్కరణలపై ఐక్య గళం
ఉగ్రవాదం, వాతావరణ మార్పుపై కలసికట్టుగా పోరాటం
* మనది వ్యూహాత్మక ప్రయోజనాలకు మించిన బంధం
* ఇండియా- ఆఫ్రికా ఫోరం సదస్సులో మోదీ
* ఆఫ్రికాకు రూ. 65.33 వేల కోట్ల రుణం; అభివృద్ధి ప్రాజెక్టుల్లో చేయూత
న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితిలోని భద్రతామండలిలో సంస్కరణల కోసం భారత్, ఆఫ్రికాలు ఐక్యంగా గళమెత్తాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మారనట్లయితే ఐరాస అసంబద్ధమైన సంస్థగా మారే ప్రమాదముందని హెచ్చరించారు.
ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదంపైనా భారత్, ఆఫ్రికాలు కలసికట్టుగా పోరాడాలన్నారు. మూడో ఇండియా- ఆఫ్రికా ఫోరం సదస్సులో గురువారం మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ఐరాస సంస్కరణల విషయంలో జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కూడా మోదీతో జత కలిశారు. భద్రతామండలిలో భారత్తో పాటు ఆఫ్రికాలోని రెండు దేశాలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రతామండలిలోని శాశ్వత దేశాలు ఆఫ్రికా దేశాలను చిన్నచూపు చూస్తున్నాయని, తమను మరుగుజ్జులుగా భావిస్తూ అవమానిస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా భారత్ తరఫున ఆఫ్రికాకు రాను న్న ఐదేళ్లలో రూ. 65.33 వేల కోట్ల మేరకు రాయితీతో కూడిన రుణాన్ని మోదీ ప్రకటించారు. రూ. 3.9 వేల కోట్ల సహాయక నిధిని కూడా ప్రకటించారు. ఇవి భారత్ ఇప్పటికే అందిస్తున్న రుణ సదుపాయాలకు అదనమని పేర్కొన్నారు. భారత్, ఆఫ్రికాలది వ్యూహాత్మక ప్రయోజనాలు, ఆర్థిక లబ్ధికి మించిన భాగస్వామ్య బంధమని పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో మూడో వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల స్వప్నాలు ఒక్కటిగా వ్యక్తమవుతున్నసందర్భం ఇదని వ్యాఖ్యానించారు. ‘125 కోట్లమంది భారతీయుల, 125 కోట్లమంది ఆఫ్రికన్ల హృదయ స్పందన ఒక్కటిగా వినిపిస్తోంద’ంటూ అభివర్ణించారు. ఉమ్మడి లక్ష్యాలైన శాంతి, అభివృద్ధి సాధన కోసం భారత్, ఆఫ్రికాలు ఒక్కటిగా సాగుతాయని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు.
ఈ సదస్సు గత మూడు దశాబ్దాల్లో భారత్ నిర్వహిస్తోన్న అతిపెద్ద కార్యక్రమం. ఇందులో 54 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అందులో 41 ఆఫ్రికా దేశాల అధినేతలు ప్రతినిధులుగా హాజరయ్యారు. మోదీ ప్రసంగం లోని ముఖ్యాంశాలు..
* ప్రపంచం గతమెన్నడూ చూడని వేగంతో రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో అత్యంత విస్తృతంగా మార్పు చెందుతోంది. ఐరాస సహా అంతర్జాతీయ సంస్థలు మాత్రం గత శతాబ్ద పరిస్థితులనే ప్రతిబింబిస్తున్నాయి. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మార్పులు చేసుకోలేకపోతే అవి అసంబద్ధ సంస్థలుగా మిగిలిపోతాయి. అందుకే ఆయా సంస్థల్లో సంస్కరణలను భారత్ కోరుకుంటోంది.
* ఐరాసలోని మొత్తం దేశాల్లో పాతిక శాతం ఆఫ్రికా దేశాలే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఈ రెండింటి నుంచి సరైన ప్రాతినిధ్యం లేని అంతర్జాతీయ సంస్థలేవైనా.. మొత్తం ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కాదు.
* ఉగ్రవాదం, వాతావరణ మార్పు, ఐరాస సంస్కరణలు.. వీటి విషయంలో భారత్- ఆఫ్రికాలు సహకరించుకోవాలి.
* ఆఫ్రికా దేశాల్లో శాంతి పరిరక్షణకు ఆఫ్రికా దళాలకు భారత్ తరఫున శిక్షణనిస్తాం.
* గత పదేళ్లలో ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యం రెండింతలయింది. 34 ఆఫ్రికా దేశాలకు భారతీయ మార్కెట్లో పన్ను రహిత ప్రవేశం లభిస్తోంది. ఆఫ్రికా ఇంధనంతోనే భారత ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది.
* ఆఫ్రికాలో భారత్ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు చేపడ్తోంది. ఆఫ్రికాలో డిజిటల్ విప్లవానికి భారత్ సహకరిస్తుంది.
* భారత్, ఆఫ్రికాల్లో రెండొంతుల జనాభా యువతే. ఆ మానవవనరులను సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఈ శతాబ్దం మనదే.
* సౌరశక్తి సమృద్ధిగా లభించే దేశాలు కూట మిగా ఏర్పడి, స్వచ్ఛ విద్యుత్ కోసం కృషి చేయాలి.
* మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలలు కన్న పాన్ ఆఫ్రికా ఈ నెట్వర్క్ను విస్తృతం చేస్తాం.
* భవిష్యత్ ప్రగతికి కీలకమైన ‘నీలి ఆర్థిక వ్యవస్థ’ అభివృద్ధికి సహకరిస్తాం.
* వచ్చే సంవత్సరం నైరోబీలో జరిగే డబ్ల్యూటీవో భేటీలో ఆహార భద్రత, వ్యవసాయ సబ్సీడీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఒత్తిడి తేవాల్సి ఉంది.