ద్రవిడ్ మరింత దూసుకుపోతున్నాడు..
న్యూఢిల్లీ: టీమిండియాకు విశేష సేవలందించిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ రిటైర్మంట్ తర్వాత కూడా తన జోరును కొసాసాగిస్తున్నాడు. అలా అని అతడు మళ్లీ బ్యాట్ పట్టాడా.. అని అనుమానం అక్కర్లేదండి. ప్రస్తుతం అండర్ 19, ఇండియా ఏ జట్టుకు ద్రవిడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కోచ్ బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు గానూ ద్రవిడ్ అందుకుంటున్న మొత్తం ఎంతో తెలిస్తే అశ్చర్యపోవాల్సిందే. బీసీసీఐ ఏడాదికి ద్రవిడ్ కు రూ.2.62 కోట్లు చెల్లిస్తోంది. బోర్డు నుంచి రూ.25 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తం అందుకుంటున్న వారి వివరాలను తమ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 2న ద్రవిడ్ కు రూ.1.3 కోట్లు చెల్లించినట్లు కూడా పేర్కొన్నారు.
భారత మాజీ ఆటగాడు, లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ క్రికెట్ బోర్డు నుంచి ఇటీవల రూ.90 లక్షలు అందుకున్నాడు. అయితే జనవరి-మార్చి నెలల మధ్య వ్యాఖ్యతగా వ్యవహరించినందుకు పెద్ద మొత్తాన్ని ఆయనకు బోర్డు చెల్లిస్తుంది. గావస్కర్ తర్వాత అంత భారీ మొత్తంలో అందుకున్న వాళ్లలో ద్రవిడ్ ముందున్నాడు. ద్రవిడ్ కోచింగ్ పై నమ్మకం, యువకుల టాలెంట్ ను వెలికి తీయడంలో అతడికి సాటిలేరని భావించిన బీసీసీఐ ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీకరించి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.