నాగరికం
ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్
నాలుగు రోజుల క్రితం పటాన్చెరు దగ్గర ఒకరింట్లోకి పాము వచ్చింది. అందరూ కర్రలు తీసుకుని దాన్ని చంపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి ఓ అబ్బాయ్ అడ్డుపడ్డాడు. అదే ప్రాంతంలో ఉన్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యుడు జె. శ్రీనివాస్‌కి ఫోన్ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న శ్రీనివాస్ ఒడుపుగా ఆ పామును పట్టుకుని ఒక బ్యాగులో వేసుకుని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీకి తీసుకెళ్లాడు. చూడటానికి పసుపు రంగులో ఉన్న ఆ పామును ‘ఇండియన్ ఎగ్ ఈటర్’గా గుర్తించారు. చాలా అరుదుగా కనిపించే ఆ పాము జాతిని పదిలంగా కాపాడుకోవాలంటున్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యుల్ని పలకరిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.
పాముల నుంచి మనుషులను.. మానవాళి నుంచి పాములను కాపాడటానికి పుట్టిందే ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ’. సుమారు 20 ఏళ్ల కిందట రాజ్‌కుమార్ కనూరి దీన్ని ప్రారంభించాడు. ఒక్కరితో మొదలైన ఈ సంస్థలో ఇప్పుడు వంద మంది సభ్యులున్నారు. ఇందులో డాక ్టర్, ఇంజనీర్, లాయర్, టీచర్ , విద్యార్థులు ఇలా.. అన్ని రంగాలవారు ఉన్నారు. నగరంలో పాములను కాపాడే నాగరికతను పెంచుతున్న ఈ సొసైటీ గతేడాది 2,600 పాములను కాపాడింది.
ఆక్రమణ మనదే..
‘మన నివాసాల్లోకి పాములు రావడం లేదు.. పాముల ఆవాసాల నే మనం కబ్జా చేస్తున్నాం’ అని అంటున్నారు ఈ స్నేక్ ఫ్రెండ్స్. ‘పాములు నివసించే ప్రాంతాలకు వెళ్లి పుట్టలను పడగొట్టి, అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నాం. ఇక అవి ఇళ్లలోకి రాక ఏం చేస్తాయి ? హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పటాన్చెరు ప్రాంతాల నుంచి మాకు కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి.
కన్స్ట్రక్షన్స్ చాలా జరుగుతున్న ప్రాంతాల్లోనే పాములు జనాల మధ్యకు వస్తున్నాయి. వాటి రక్షణ బాధ్యత మనదే అనుకున్నవారు మాకు ఫోన్ చేస్తున్నారు. లేదంటే చంపేస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు ఈ సొసైటీ సభ్యుడు అవినాశ్.
రక్షకులు...
సొసైటీలోని సభ్యుల నివాసాలను బట్టి ప్రాంతాలవారీగా పాముల రక్షణ బాధ్యతలను పంచుకుంటారు. రోజూ పట్టుకుని వచ్చిన పాములను మల్కాజ్‌గిరిలోని సొసైటీ ఆఫీస్‌లో ఉంచుతారు. నెల రోజులకోసారి ఈ పాములను తీసుకెళ్లి సిటీకి దూరంగా ఉన్న అడవుల్లో వదిలేస్తారు. ఈ సొసైటీ కార్యాలయంలో ఇప్పుడు ఇరవై పాముల వరకూ ఉన్నాయి. వాటికి ఎప్పుడూ ఇద్దరు సభ్యులు కాపలా ఉంటారు. పాముల రక్షణ మన బాధ్యత అని గుర్తించిన వారు ఈ సొసైటీలో సభ్యులుగా చేరుతుంటారు. వీరికి పామును ఎలా పట్టుకోవాలో సీనియర్ సభ్యులు శిక్షణ ఇస్తారు. ‘పాములు ఎవరికీ ఏ హాని తలపెట్టవు. ఏళ్లుగా మేం కొన్ని వేల పాములను పట్టుకున్నాం. అవి హాని చేసిన సందర్భాలు లేవు’ అని చెబుతారు మరో సభ్యుడు వరుణ్ వైష్ణవ్.
ఇష్టంతోనే...
పాములపై ఇష్టంతో సినీనటుడు సాయికిరణ్ ఈ సొసైటీలో చేరాడు. ఏడేళ్లలో మూడువేల పాములను రక్షించారు కూడా. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పాము వచ్చిందని సమాచారం అందిన వెంటనే సాయికిరణ్ అక్కడ వాలిపోతారు. ఈ ప్రాంతాల్లోని సినీప్రముఖుల ఇళ్లలో పాము కనిపిస్తే వెంటనే మనోడికి కాల్ వస్తుంది. ‘కనిపించిన పాములను చంపుతూ పోతే భవిష్యత్తు తరాలకు పాములను టీవీల్లోనూ, కంప్యూటర్లోనో చూపించాల్సి ఉంటుంది. అందుకే వాటి రక్షణకు అందరూ ముందుకు రావాలని’ అంటారు సాయికిరణ్.
ఆడించడమూ నేరమే...
నాగుల పంచమి, చవితి పండుగలకు పాములను ఆడించే వారి నుంచి వాటిని రక్షించే బాధ్యతను భుజానికెత్తుకుంది ఈ సొసైటీ. ‘పాములు ఆడించడం నేరం, అలా చేసిన వారికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేల జరిమానా ఉంటుంది. నిజానికి పాములు పాలు తాగవు. కానీ పాములు ఆడించే వారు పండుగలకు కొన్ని రోజుల ముందు నుంచి వాటి కోరలు తీసేసి.. మూతి కుట్టేసి.. కనీసం మంచినీళ్లు ఇవ్వకుండా మాడుస్తుంటారు. పండుగ రోజున బుట్టల్లో పెట్టుకుని ఇంటింటికీ తిరిగి ఆడిస్తారు. తర్వాత వాటిని తీసుకెళ్లి బతికుండగానే వాటి చర్మం వలుచుకుంటారు. నాగుపాము సెంటిమెంట్‌తో వారు పాములను హింసించే తీరు దారుణంగా ఉంటుంది. అందుకే ఈ పండుగల సమయంలో వారిపై ప్రత్యేక దృష్టి పెడతాం. అలా దొరికిన పాములకు వైద్యం చేయించి, తిరిగి కోరలు వచ్చాక తీసుకెళ్లి అడవుల్లో వదిలేస్తాం’ అని చెప్పారు అవినాష్. కోరల్లో విషాన్ని దాచుకున్న పాములు కూడా మూగజీవాలే. వీటిని కాపాడటానికి ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యులు చేస్తున్న ప్రయత్నానికి అందరూ సెల్యూట్ చేయాలి.
- భువనేశ్వరి