జీతూ రాయ్‌కు రజతం
రియో ఒలింపిక్స్‌కు అర్హత
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్
గ్రనాడా (స్పెయిన్): ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత పిస్టల్ షూటర్ జీతూ రాయ్ ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లోనూ మెరిశాడు. మంగళవారం జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్ రజతం సాధించాడు. తద్వారా 2016లో రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడయ్యాడు.
ఫైనల్లో జీతూ రాయ్ 191.1 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. భారత సైన్యంలో పనిచేసే 25 ఏళ్ల జీతూ రాయ్‌కు ఇది వరుసగా ఐదో అంతర్జాతీయ పతకం కావడం విశేషం. ఇక మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ అయోనిక పాల్ ఫైనల్‌కు చేరుకున్నా ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కిది ఎనిమిదో పతకం.
పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ‘ట్రిపుల్ ఒలింపిక్ చాంపియన్’ జిన్ జోంగో (దక్షిణ కొరియా) 192.3 పాయింట్లతో స్వర్ణ పతకం... వీ పాంగ్ (చైనా) 172.6 పాయింట్లతో కాంస్యం సాధించారు. క్వాలిఫయింగ్‌లో జిన్ జోంగో 583 పాయింట్లు స్కోరు చేసి 34 ఏళ్లుగా ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు 581 పాయింట్లతో అలెగ్జాండర్ మెలెంటియెవ్ (1980 మాస్కో ఒలింపిక్స్) పేరిట ఉండేది.