సుంకాల్లో మార్పులు.. చిన్న కార్లకు లాభం
కొలంబో : శ్రీలంక ప్రభుత్వం దిగుమతి సుంకాల్లో మార్పులు తీసుకొచ్చింది. 800 నుంచి 1000 సీసీ కార్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. అదేవిధంగా ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కార్లపై మాత్రం దిగుమతి డ్యూటీని పెంచేసింది. శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్ లో తయారయ్యే చిన్న కార్ల కంపెనీలు ఎక్కువగా లాభపడనున్నాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదలచేసింది. శ్రీలంకకు 800 నుంచి 1000 సీసీ వెహికిల్స్ ఎక్కువగా ఎగుమతి చేస్తున్నది భారత మార్కెటే కావడంతో, ఈ వెహికిల్స్ కు లాభం చేకూరనుందని డీలర్లు తెలిపారు.
ప్రస్తుతం శ్రీలంక రూపాయల్లో 1.5 నుంచి 1.6 మిలియన్లగా ఉన్న టాక్స్ రేంజ్, ఈ దిగుమతి సుంకం తగ్గింపుతో ఆ కార్లకు టాక్స్ రేంజ్ 1.35 మిలియన్లు ఉండనుందని కారు డీలర్లు చెప్పారు. అయితే ఎస్ యూవీ లాంటి ఎక్కువ రేంజ్ ఉన్న వెహికిల్స్ కు దిగుమతి సుంకాలు పెరిగాయి. ఈ సుంకాలు శ్రీలంక రూపాయల్లో 5.4 మిలియన్ నుంచి 7.6 మిలియన్లకు పైగా పెరిగాయి.
1000 క్యూబిక్ సెంటీమీటర్ పైగా ఇంజీన్ సామర్థ్యమున్న వెహికిల్స్ పన్ను రేట్లను పెంచడంతో, ఆ కార్ల ధరలు కూడా పన్నులతో పాటు పైకి ఎగబాకనున్నాయని శ్రీలంక వాహన దిగుమతిదారుల అసోసియేషన్ తెలిపింది. త్రీ వీలర్ ఆటో టాక్సీలకు కూడా కస్టమ్ డ్యూటీ రేట్లను పెంచినట్టు డీలర్లు పేర్కొన్నారు. శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయంతో క్షీణిస్తున్న విదేశీ నిల్వలు ఆ ప్రభుత్వం పెంచుకోనుంది.