మొబైల్ ఫోన్లకూ ధ్రువీకరణ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒక పూట తిండి లేకున్నా ఉండగలం. కానీ మొబైల్ ఫోన్ లేకుంటే.. ఊహించుకోవడానికే మనసొప్పడం లేదు కదూ!!. అంతలా మనిషి జీవితం సెల్‌ఫోన్ మయమైపోయింది. మరి అలాంటి ఫోన్ నాణ్యత ఏ పాటిదో ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే టెలికం శాఖ ఒకడుగు ముందుకేసి నాణ్యణ ప్రమాణాలు రూపొం దించే పనిలో పడింది. సెల్ఫోన్ల భద్రత, పనితీరు ఆధారంగా ధ్రువీకరణ ఇవ్వాలని యోచిస్తోంది.
ఈ విషయమై టెలికం ఇంజనీరింగ్ సెంటర్(టీఈసీ), బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ప్రతి నిధులతో ఇప్పటికే టెలికం శాఖ చర్చించింది. భారత టెలిగ్రాఫ్ చట్టాన్ని సవరించటమా? లేక బీఐఎస్ ద్వారా ప్రమాణాలను ప్రకటించటమా? అనేది యోచిస్తోంది. ప్రతిపాదిత ప్రమాణాలు అమల్లోకి వస్తే మరింత నాణ్యమైన సెల్ఫోన్లు తయారవుతాయి. 2012-13లో రూ.25,800 కోట్ల విలువైన సెల్ఫోన్లను భారత్ దిగుమతి చేసుకుంది. దేశం మొత్తమ్మీద ఏడాదికి 25 కోట్ల సెల్ఫోన్లు అమ్ముడవుతున్నాయి.
బీఐఎస్ పరిధిలోకే..
ఎలక్ట్రానిక్స్, ఐటీ గూడ్స్ ఆర్డర్-2012 ప్రకారం ఎలక్ట్రానిక్ వీడియో గేమ్స్, ల్యాప్‌టాప్, నోట్‌బుక్, ట్యాబ్లెట్ పీసీలు. 32 అంగుళాలు, ఆపైన సైజున్న ప్లాస్మా, ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు. ఆప్టికల్ డిస్క్ ప్లేయర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, విజువల్ డిస్ప్లే యూనిట్లు, వీడియో మానిటర్లు, ప్రింటర్లు, ప్లాటర్లు, స్కానర్లు, వైర్లెస్ కీబోర్డులు, టెలిఫోన్ ఆన్సరింగ్ మెషీన్లు, యాంప్లిఫయర్లు, ఎలక్ట్రానిక్ మ్యూజికల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ క్లాక్స్, సెట్ టాప్ బాక్సులు వంటి 15 రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు బీఐఎస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వీటిని కంపెనీలు బీఐఎస్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం తయారు చేయాలి. 2014 జనవరి3 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి.
వీటిలానే మొబైల్ ఫోన్లకూ ప్రమాణాలను రూపొందించే పనిలో బీఐఎస్ వర్గాలు ఇప్పటికే నిమగ్నమయ్యాయి. టెలికం శాఖ, టీఈసీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రమాణాలను నిర్దేశిస్తామని బీఐఎస్ వెల్లడించింది. కాగా ఈ ప్రమాణాలు ఆహ్వానించదగ్గవని, కస్టమర్లకు నాణ్యమైన మొబైల్ ఫోన్లు లభిస్తాయని సెల్కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. చైనా చవక ఉత్పత్తులకు, నల్ల బజారులో లభించే సెల్ఫోన్లకు అడ్డుకట్ట పడుతుందన్నారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం రిజిస్టర్ అయిన ఉత్పత్తులకు నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయా లేవా అని ఎప్పటికప్పుడు బీఐఎస్ పరీక్షిస్తుంటుంది. మార్కెట్లో శాంపిళ్లను సేకరించి బీఐఎస్ అనుమతి ఉన్న టెస్టింగ్ ల్యాబ్‌లకు పంపిస్తారు. నాణ్యత లోపించినట్టు తేలితే ఉత్పత్తులను సీజ్ చేస్తారు. ఈ వివరాలను బీఐఎస్ వెబ్సైట్లో పొందుపరుస్తారు.