ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లాంచ్..వడ్డీ ఎంత?
జైపూర్: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ మరోకీలక ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటి పే మెంట్ బ్యాంకును రాజస్థాన్‌లో లాంచ్ చేసింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ పేరుతో ప్రయోగాత్మకంగా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్టెల్ రీటైల్ అవుట్ లెట్స్ లో ఈ బ్యాంక్ ఖాతాలు తెరవచ్చని ఎయిర్ టెల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తద్వారా నగదు డిపాజిట్, ఉపసంహరణ వంటి సదుపాయాలను అందించనున్నట్టు తెలిపింది. డీమానిటైజేషన్ తో ఇబ్బందులు పడుతున్న దేశ ప్రజలకు క్యాష్ లెస్ (డిజిటల్) పేమెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొంది.
ఈ పైలట్ తో,తాము బ్యాంకింగ్ సేవల ప్రారంభంలో ముందడుగు వేసామని ,అనంతరం భారతదేశం అంతటా పూర్తి స్థాయి సేవలను ప్రారంభించేందుకు కార్యాచరణను సిద్ధం చేశామని ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకు ఎండీ, సీఈవో శశి అరోరా తెలిపారు. చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు, చెల్లింపులకు సేవలు, తక్కువ ఆదాయ గృహాలు, చిన్న వ్యాపారాలు,ఇతర అసంఘటిత రంగ సంస్థల అవసరాలను తీర్చటానికిఈ బ్యాంకునుప్రారంభించినట్టు చెప్పారు. మరోవైపు ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా విజన్ కు ఈ బ్యాంకు సరిగ్గా సరిపోతుందని రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుధరా రాజే కూడాదీనిపై సంతోషం వ్యక్తం చేశారు.. దేశంలోని నలుమూలలకు ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకు సేవలు విస్తరించాలని ఆమె కోరుకున్నారు.
రాజస్థాన్‌లోని పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలకు ప్రాథమిక, సౌకర్యమైన బ్యాంకింగ్ సేవలను అందించనున్నామని కంపెనీ పేర్కొంది. 10,000 ఎయిర్టెల్ రిటైల్ షాపుల్లో బ్యాంకింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఎయిర్టెల్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా చెల్లింపు బ్యాంక్‌ను విస్తరించేందుకు, వ్యవస్థలను పరీక్షించే లక్ష్యంగానే దీన్ని ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. 2016 డిసెంబరుకు రాజస్థాన్‌లో బిజినెస్ నెట్‌వర్క్‌ను 1,00,000కు విస్తరించేందుకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సన్నద్ధమవుతోంది.
వార్షిక పొదుపు ఖాతాల డిపాజిట్లపై 7.25శాతం వడ్డీరేటును అందించనున్నట్టు తెలిపింది.దీంతోపాటుగా ప్రతి సేవింగ్స్ ఖాతాపై రూ.లక్ష వరకు వ్యక్తిగత ప్రమాద బీమాను అందించనున్నట్లు బ్యాంక్ తెలిపింది. పూర్తి డిజిటల్‌గా పనిచేసే ఈ చెల్లింపు బ్యాంక్‌లో ఖాతాను అధార్ ఆధారిత ఇ-కేవైసీతో తెరవొచ్చని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. దేశంలో ఏ బ్యాంక్ ఖాతాకైనా నగదు బదిలీ చేసుకునే సౌలభ్యం ఉందని, ఎయిర్టెల్ బ్యాంక్ ద్వారా ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ నంబర్లకు ఉచితంగా నగదు పంపించవచ్చని పేర్కొంది.
కాగా గతేడాది ఏప్రిల్‌లో చెల్లింపు బ్యాంక్‌ల ఏర్పాటుకోసం ఎయిర్ టెల్ కు ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ అనుమతి లభించింది. 2016 ఫిబ్రవరిలో రూ.98. 8 కోట్లతో కోటక్ మహీంద్ర బ్యాంకు 19.90 శాతం వాటాను కొనుగోలుచేసింది.