ఇన్పుట్ సబ్సిడీకి గ్రీన్ సిగ్నల్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులకు శుభవార్త. వర్షాలతో నష్టపోయిన కష్టజీవికి ఊరటనిచ్చేందుకు సర్కారు సన్నద్ధమైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయితీ) మంజూరీకి పచ్చజెండా ఊపింది. ఇప్పటికే జిల్లాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన ప్రభుత్వం.. బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో వారం రోజుల్లో జిల్లాలకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా జిల్లాకు రూ. 24.45 కోట్లు విడుదల కానున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో పంట నష్టపోయిన 92,483 మంది రైతులకు ఈ నిధులు పంపిణీ చేయనున్నారు. గత ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లా రైతాంగం కుదేలైంది.
సెప్టెంబర్ నెలాఖరు నుంచి నవంబర్ వరకు వరుసగా వర్షాలు కురిశాయి. దీంతో పంటనష్టం అంచానాలకు ఉపక్రమించిన అధికారులు తుది నివేదికలను ప్రభుత్వానికి అందజేశారు. ఇందులో అధికంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి. ఇవేగాకుండా జొన్న, ఆముదం, సోయాచిక్కుడు పంటలు కూడా పాడయ్యాయి. ఈనేపథ్యంలో నివేదికలు రూపొందించిన వ్యవసాయ శాఖ అధికారులు నవంబర్ నెలాఖరులో ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం రెండ్రోజుల క్రితం ఆమోదం తెలిపినట్లు సమాచారం. రెండు,మూడు రోజుల్లో నిధుల వివరాలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇదిలా ఉండగా.. ఉద్యాన పంటలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత రెండేళ్ల నుంచి కూడా నష్టపోయిన ఉద్యాన రైతులకు ఇప్పటివరకు కూడా పరిహారం జాడ లేకపోవడం గమనార్హం.