సగం పుస్తకాలు అమెరికా, చైనాలవే..!
జెనీవా : ప్రపంచానికి పెద్దన్న అమెరికా.. అభివృద్ధిలో దూసుకుపోతున్న చైనాలు పుస్తక ప్రపంచంలోనూ తిరుగులేని స్థానంలో నిలిచాయి. ప్రపంచదేశాలన్నీ కలిపి 2015లో 1.6 మిలియన్ పుస్తకాలు ప్రచురించగా.. వాటిలో ఈ రెండు అగ్ర దేశాలు సగ భాగం పంచుకున్నాయి.
జెనీవా కేంద్రంగా పని చేసే ఇంటర్నేషనల్ పబ్లిషర్స్ అసోసియేషన్ (ఐపీఏ) ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పుస్తకాల ప్రచురణ, పంపిణీలను అధ్యయనం చేయడం ఐపీఏ విధి. గత కొన్నేళ్లుగా అమెరికా, చైనాలు పుస్తక విక్రయ రంగంలో దూసుకుపోతున్నాయని తెలిపింది.
సగం ఆక్రమించిన అగ్ర దేశాలు..
ఐపీఏ గత అక్టోబర్లో విడుదల చేసిన నివేదికలో చైనా, అమెరికాలు కొత్త పుస్తకాల ప్రచురణలో ఏ స్థాయిలో ముందున్నాయో తెలిపింది. పుస్తక విక్రయాల్లో పెద్ద మార్కెట్ ఉన్న 25 దేశాల్లో 2015లో చైనా 28 శాతం, అమెరికా 20 శాతం పుస్తకాల్ని మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ గణాంకాల్లోకి కేవలం కొత్త పుస్తకాలు, పునఃముద్రిత శీర్షికలతో విడుదలైన వాటినే తీసుకున్నారు. స్వయం ముద్రిత పుస్తకాలు అన్నింటిని గణనలోకి తీసుకోలేదు. పలు మూలాల నుంచి పుస్తకాలకు సంబంధించిన డేటాను సేకరించామనీ, కచ్చితత్వం ఉండకపోవచ్చునని ఐపీఏ తెలిపింది.
తలకు ఎన్ని పుస్తకాలు..
రెండూ పెద్ద దేశాలు. జీడీపీలోనూ సంపన్నమైనవే. బుక్ పబ్లిషింగ్లో వాటి పాత్ర అంతలా ఉండటం వింతేం కాదు. పుస్తకాల పట్ల దేశం కనబరుస్తున్న శ్రద్ధ ఆయా దేశాల తలసరి పుస్తక విలువను తెలుపుతుంది. దేశంలోని ప్రతి వ్యక్తికి (తలసరి) ఎన్ని పుస్తకాలు లభ్యం అన్నప్పుడు.. అమెరికా, చైనాలు తమ స్థానాల్లో వెనకబడ్డాయి. చైనాలో ప్రతి వ్యక్తికి 335, అమెరికాలో 1043 పుస్తకాలు అందుబాటులో ఉండగా.. తలసరి పుస్తకాల సంఖ్య 2710తో యూకే ప్రథమ స్థానంలో ఉంది.