నా దీక్షతోనైనా పవన్ కళ్లు తెరవాలి: సూర్యచంద్ర
సాక్షి, తూర్పుగోదావరి: జగ్గంపేట సీటును ఆశించి జనసేన నేత పాఠంశెట్టి సూర్యచంద్ర భంగపాటుకు గురయ్యారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా జగ్గంపేట సీటును తెలుగుదేశం పార్టీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించారు. దీంతో జనసేన నేత సూర్యచంద్ర తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రోడ్డుపైనే బోరున విలపించారు. అనంతరం, ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నిన్న రాత్రి అంతా అచ్చుతాపురంలోని అమ్మవారి ఆలయంలో దీక్షకు దిగారు.
కాగా, ఈరోజు ఉదయం సూర్యచంద్ర మీడియాతో మాట్లాడుతూ..‘డబ్బులు లేని వారికి రాజకీయాల్లో స్థానం లేదు. ఐదేళ్లు జనం మధ్యలో ఉంటూ జనం సమస్యల కోసం పోరాడాను. పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తానని చెప్పారు. నాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు పొత్తు ధర్మంలో టికెట్ రాలేదని చెప్తున్నారు. డబ్బులేని వారెవరు రాజకీయాల్లోకి రాకుండా ఉండాలని కోరుతూ ఆమరణ దీక్ష చేస్తున్నాను. నా మరణం రాజకీయ పార్టీలతో సహా అందరికీ కనువిప్పు కలగాలి’ అంటూ కామెంట్స్ చేశారు.
మరోవైపు, సూర్యచంద్ర సతీమణి శ్రీదేవి మాట్లాడుతూ..‘పొత్తు ధర్మం పేరు చెప్పి జనసేన పార్టీ మమ్మల్ని మోసం చేసింది. డబ్బు లేదని తెలిసి జనాల్లో తిరుగుతూ కష్టపడే నాయకున్ని ఎందుకు విస్మరించారు. మాపై ఆధారపడిన జనసేన కార్యకర్తల పరిస్థితి ఏమిటి?. జనసేన కార్యకర్తలు ఎవరూ కుటుంబాల్ని, తల్లిదండ్రులను విడిచిపెట్టి పార్టీ కోసం త్యాగాలు చేయకండి. నా భర్తకు అన్యాయం జరిగింది. ఐదేళ్లుగా ఇద్దరం జనం సమస్యలపై పోరాడుతున్నా పవన్ మమ్మల్ని పరిగణలోకి తీసుకోకపోవడం దారుణం. జనసేన పార్టీలో డబ్బున్న వారికే టికెట్లు. మా ప్రాణ త్యాగం అందరికీ గుణపాఠం కావాలి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.