ఢిల్లీ చేరిన జైళ్ల శాఖ అధికారుల సైకిల్ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలన, కాలుష్య నివారణ, జాతీయ సమైక్యత లక్ష్యంగా సెప్టెంబరు 30న హైదరాబాద్‌లో ప్రారంభమైన రాష్ట్ర జైళ్ల శాఖ అధికారుల సైకిల్ ర్యాలీ శనివారం ఢిల్లీకి చేరుకుంది. ఈ ర్యాలీలో పాల్గొన్న 12 మంది పోలీసు అధికారులు.. 1,875 కి.మీ. దూరాన్ని 18 రోజుల్లో పూర్తిచేశారు. ర్యాలీ పూర్తిచేసిన అధికారులకు రాష్ట్ర జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వినయ్ కుమార్ సింగ్ ఇండియా గేట్ వద్ద స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. జైళ్లను అవినీతి రహితంగా మార్చినట్లు పేర్కొన్నారు. ఖైదీలకు విద్యావకాశాలు కల్పించడంతో పాటు ఉపాధిలో శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. యాత్రలో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని జైళ్లను సందర్శించినట్లు ర్యాలీలో పాల్గొన్న మహబూబ్‌నగర్ జైల్ సూపరింటెండెంట్ సంపత్ తెలిపారు.