‘జైకా’దు.. నై
నమ్మించి ముంచిన జపాన్ కంపెనీ
మూడుసార్లొచ్చినా.. మొండిచెయ్యే!
మదనపల్లె మార్కెట్లో కలగా మారిన
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్
మదనపల్లె: మదనపల్లె టమాటా మార్కెట్‌కు జపాన్ కంపెనీ జైకా(జపనీస్ ఇంటర్నేషనల్ కో- ఆపరేటివ్ ఏజెన్సీ) మొండిచేయి చూపింది. ఈ బృందం రాక తో తమ కష్టాలు తీరుతాయనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. ఈ కంపెనీ ప్రతినిధులు మూడుసార్లు పర్యటనలు చేపట్టినా సాగు విధానంలో పరిశోధనలు, మార్కెట్లో మౌలిక వసతులపై ఎలాంటి ముందడుగూ పడలేదు. దీంతో ఎప్పటిలాగే రైతులు, వ్యాపారులు కష్టాల మధ్యే వ్యాపారాలు చేస్తున్నారు.
పర్యటనలు ఇలా..
గత ఏడాది జనవరి 19, మార్చి 5, డిసెంబర్ 16వ తేదీల్లో విడివిడిగా జైకా సంస్థ ప్రతినిధులు మదనపల్లెకు వచ్చి మార్కెట్‌పై క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపారు. ప్రపంచంలోనే చైనా తరువాత, ఎక్కువగా టమాట పండించే ప్రాతంగా గుర్తింపుపొందిన మదనపల్లెలో దిగుబడిని మరింతగా పెంచేందుకు ప్రణాళికలూ రచించారు. కానీ ఆచరణలో మాత్రం ఎలాంటి ఆర్థిక, రాజకీయ సహకారం లేకపోవడంతో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. జైకా ప్రతినిధులు ప్రకాష్, ప్రకాష్ పి.దేశాయ్, యోకియో ఐకెడ, యోషికో హోండాలు, ఇషిజాకి యోసహియుకి రైతులతో ముఖాముఖీలు నిర్వహించి నివేదికలు రూపొందించారు.
మార్కెట్ వివరాలను పూర్తిగా తెలిపిన కార్యదర్శి..
మార్కెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అప్పటి ఏఎంసీ కార్యదర్శి జగదీష్ జైకా కంపెనీ ప్రతినిధులకు వివరించారు. మదనపల్లె మార్కెట్ వార్షిక ఆదాయం, ఖర్చు వివరాలను తెలియజేశారు. దీంతో జైకా సంస్థ మార్కెట్ యార్డు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలు, భవన నిర్మాణాలకు సంబంధించిన వివరాలతో నివేదిక రూపొందించింది. అయితే తదనంతరం ఆ దస్త్రాలు మూలనపడేయడంతో అభివృద్ధి మేడిపండు చందంగా మారింది.
కలగా ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్
మార్కెట్లో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ కలగానే మిగిలింది. జైకా బృందం పర్యటనతో ఇది సాధ్యమౌతుందనుకున్న మార్కెట్ అధికారులు.. ప్రస్తుతం ఇక ఆ విషయం మర్చిపోవాల్సిందే అన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రభుత్వపెద్దలు, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.