జయచందర్‌కు ఘనంగా నివాళి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: అనంతపురం అదనపు జాయింట్ కలెక్టర్ తిరువీధుల వెంకట జయచందర్ (57) కర్నూల్లో మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఖమ్మంజిల్లాతో ఆయనకు సుధీర్ఘ అనుబంధం ఉంది. ఖమ్మంలో డీఆర్వోగా పనిచేస్తూ ఆయన రెండు నెలల క్రితం ఉద్యోగోన్నతిపై అదనపు జాయింట్ కలెక్టర్‌గా అనంతపురానికి వెళ్లారు. 2010 నవంబర్ 22వ తేదీన జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2013 సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఇక్కడ పనిచేశారు. రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంతో పాటు ఉద్యోగుల సమస్యలపై కూడా స్పందించే వారు. సౌమ్యుడిగా, రెవెన్యూ వ్యవస్థలో అనుభవం కలిగిన వ్యక్తిగా ఉద్యోగుల్లో మంచి గౌరవం పొందారు. ఆయన మృతిచెందిన విషయం తెలుసుకున్న జిల్లా రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
పలువురి సంతాపం..
జయచందర్ మృతిచెందిన విషయం తెలుసుకున్న కలెక్టరేట్ సిబ్బంది, రెవెన్యూ శాఖ ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమతో మంచి అనుబంధం కలిగిన అధికారి ఇలా దుర్మరణం పాలవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో మంగళవారం సంతాప సభ నిర్వహించారు. జాయింట్‌కలెక్టర్ సురేంద్రమోహన్ ఆధ్వర్యంలో జయచందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, డీఆర్వో శివ శ్రీనివాస్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కారుమంచి శ్రీనివాసరావు, తెలంగాణా వీఆర్వోల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గరికె ఉపేందర్ మాట్లాడారు. జయచందర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముజాహిద్, రెవెన్యూ ఉద్యోగులు లక్ష్మణరావు, వెంకన్న, సాంబశివరావు, రాధాకృష్ణ, అఫ్జల్, రవి తదితరులు పాల్గొన్నారు. జయచందర్ మృతిపట్ల తెలంగాణా గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు ఖాజామియా, తెలంగాణా పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటపతిరాజు, భానుమూర్తి, మల్లెల రవీంద్రప్రసాద్, బడ్జెట్ శ్రీనివాస్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తంచేశారు.
తుమ్మల సంతాపం...
అనంతపురం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ టిఏ.జయచందర్ మృతిపట్ల ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఖమ్మం, పశ్చిమగోదావరి కలెక్టర్ల సంతాపం
టీఏ.జయచందర్ మృతిపట్ల ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు ఐ.శ్రీనివాస శ్రీనరేష్, సిద్దార్ధజైన్లు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడంలో జయచందర్ చేసిన కృషి మరువలేదన్నారు.