ఉబర్ కు కోలుకోలేని దెబ్బ: ప్రెసిడెంట్ గుడ్ బై
శాన్ఫ్రాన్సిస్కో : దేశ, విదేశాల్లో పాపులర్ అయిన క్యాబ్ సర్వీసుల సంస్థ ఉబర్ మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుంది. కంపెనీ ప్రెసిడెంట్ గా ఉన్న జెఫ్ జోన్స్ ఉబర్ నుంచి వైదొలుగుతున్నట్టు ఈ శాన్ ఫ్రాన్సిస్కో సంస్థ వెల్లడించింది. కంపెనీలో జాయిన్ అయిన ఆరు నెలల కంటే తక్కువ వ్యవధిలోనే ఆయన కంపెనీని వీడనున్నట్టు కంపెనీ అధికారిక ప్రతినిధి ఆదివారం పేర్కొన్నారు. అయితే ఏ కారణం చేత ఆయన కంపెనీ వీడుతున్నారో అధికార ప్రతినిధి వెల్లడించలేదు. జోన్స్ నిష్క్రమణ తర్వాత ఆయన బాధ్యతలు ప్రశ్నార్థకంలో పడనున్నాయని కంపెనీ అధికారులంటున్నారు.
టార్గెట్ కార్పొరేషన్ లో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా ఉన్న జోన్స్ ఆగస్టులోనే ఉబర్ లో ప్రెసిడెంట్ గా జాయిన్ అయ్యారు. ప్రెసిడెంట్ గా పనిచేస్తూనే కొన్ని సీఓఓ బాధ్యతలను ఆయన నిర్వహిస్తున్నారు. ఆరు నెలల పాటు కంపెనీకి జోన్స్ అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపిన అధికార ప్రతినిధి, ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. లైంగిక వేధింపులతో గత నెలే కంపెనీ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ అమిత్ సింగల్ కూడా రాజీనామాను కోరారు. ఈ నెల మొదట్లో ప్రొడక్ట్, గ్రోత్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఈద్ బేకర్, సెక్యురిటీ రీసెర్చర్ చార్లీ మిల్లెర్ కంపెనీ నుంచి వైదొలిగారు.